మెదక్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఎలుగుబంటి దాడిలో రైతు గాయ పడిన ఘటన మెదక్ జిల్లా హవేళీఘణపూర్ మండలం దూప్‌సింగ్‌తండాలో జరిగింది. దూప్‌సింగ్ తండాకు చెందిన రవి.. సోమవారం తెల్లవారుజామున తన వ్యవసాయ పొలంలో నీరు పెట్టడానికి వెళ్లాడు. పొలం అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉండటంతో అప్పటికే పొలంలో ఉన్న ఎలుగుబంటి రవిపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో రవి ఎడమ దవడ, చెవి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పక్క పొలంలో ఉన్న రైతులు ఎలుగుబంటిని తరమడంతో అడవిలోకి వెళ్లిపోయింది.
తీవ్రంగా గాయప డ్డ రవిని మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి.. ఎలుగబంటి దాడిలో గాయపడిన రవికి చికిత్స నిమిత్తం అటవీ శాఖ తరపున రూ.10వేలు అందజేశా రు. రవికి శాఖాపరమైన పరిహారం కూడా అందిస్తామని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ మనోజ్ తెలిపారు.