11-03-2025 07:39:46 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించడానికి, ఏర్పాటుచేసిన దృశ్య, శ్రవణ పరికరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. ఆల్దాస్ జానయ్య సమక్షంలో ఆన్లైన్ విధానంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ మాట్లాడుతూ... మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రైతులు సాగు చేస్తున్న పంటలకు సంబంధించిన సమగ్ర పంటల యాజమాన్యం, వ్యవసాయ అనుబంధ రంగాలపైన శాస్త్రవేత్తలతో నేరుగా చర్చించే అవకాశం దొరుకుతుందని తెలిపారు.
ఇప్పటివరకు వ్యవసాయ శాఖ ద్వారా మాత్రమే 566 ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఈ సేవలను శాస్త్రవేత్తలతో అనుసంధానం చేసేలా 8 కృషి విజ్ఞాన కేంద్రాలు, మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలకు విస్తరించడం ద్వారా స్థానికంగా సాగు చేసే పంటల్లో తలెత్తే సమస్యలను నేరుగా శాస్త్రవేత్తలతో చర్చించే అవకాశం ఉందని చెప్పారు.
సాగు విధానంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. డాక్టర్ జి. శ్రీనివాస్, డైరెక్టర్ ఏ. ఆర్. ఐ. మాట్లాడుతూ... ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఆరుతడి పద్ధతిలో వరి సాగు విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఐ. తిరుపతి, డాక్టర్ యు. స్రవంతి,ఏ. నాగరాజు, బోధ నేతర సిబ్బంది, వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.