* అప్పు తీర్చాలని బ్యాంక్ అధికారుల ఒత్తిడి
* తాళలేక పురుగుల మందు తాగిన అన్నదాత
* ఆదిలాబాద్‌లోని ఐసీఐసీఐ బ్రాంచి ఎదుట ఉద్రిక్తత
ఆదిలాబాద్, జనవరి 1౮ (విజయక్రాంతి): తీసుకున్న అప్పు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేయడంతో ఓ రైతు బ్యాంక్‌లోనే ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బేల మండలం రేణిగూడ గ్రామానికి చెందిన రైతు జాదవ్‌దేవరావు ఆదిలాబాద్‌లోని ఐసీఐసీఐ బ్రాంచీలో రూ. 3.50 లక్షల లోన్ తీసుకున్నాడు.
అయితే అప్పు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేయడంతో జాదవ్ దేవ్‌రావు మనస్థాపానికి గురై శనివారం పురుగుల మందు డబ్బాతో బ్యాంకుకు వెళ్లాడు. అప్పు విషయంలో బ్యాంక్ అధికారులతో వాగాదానికి దిగి, అక్కడే పురుగుల మందు తాగాడు. స్థానికులు రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బ్యాంకుకు చేరుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న సైతం బ్యాంకుకు వెళ్లి బ్యాంకు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఆరు నెలలకు ఒకసారి వాయిదా పద్ధతిలో రుణాలు చెల్లిస్తూ వచ్చాడని, ఈసారి పంటలు సరిగ్గా పండకపోవడంతో రెండు నెలలు ఆలస్యమైందన్నారు. బ్యాంక్ అధికారులు తరచుగా ఇంటికి వెళ్లి రైతును డబ్బులు కట్టాల్సిందని ఇబ్బందులకు గురి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.