భూమి చదును చేస్తుండగా హత్యాయత్నం
జనగామ, జనవరి 11 (విజయక్రాంతి): వ్యవసాయ భూమి చదును చేస్తున్న దంపతులపై కొందరు వ్యక్తులు గొడ్డళ్లు, పార, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన జనగామ జిల్లాలో శనివారం వెలుగు చూసింది. రఘునాథపల్లి మండలంలోని జాఫర్‌గూడెం గ్రామానికి చెందిన కర్నె అశోక్ దంపతులు అదే గ్రామానికి చెందిన అనుగుల మల్లయ్య వద్ద ఐదేళ్ల క్రితం 17 గుంటల భూమి కొన్నారు. రూ.9 లక్షల 70 వేలకు బేరం కుదరగా.. రూ.6 లక్షలు చెల్లించారు. మరో రూ.3.70 లక్షలు రిజిస్ట్రేషన్ అనంతరం చెల్లించేట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నారు.
అప్పటి నుంచే భూమిని అశోక్‌కు అప్పగించగా వారు సాగు చేసుకుంటున్నారు. కాలం గడుస్తున్నా మల్లయ్య రిజిస్ట్రేషన్ చేయకుండా సతాయిస్తున్నాడు. మరోవైపు చెల్లించిన డబ్బు కూడా ఇవ్వడం లేదు. ఇచ్చిన డబ్బులతో పాటు భూమిని కూడా వదులుకోవాలని కొన్ని రోజులుగా మల్లయ్య కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అశోక్, సుగుణ భూమి చదును చేస్తుండగా అనుగుల మల్లయ్యతో పాటు ఆయన కుమారుడు రాజు, సోదరులు శ్రీరాములు, నర్సయ్య దాడికి దిగారు.
పార, గొడ్డళ్లు, కర్రలతో దాడి చేయడంతో అశోక్ తలకు తీవ్ర గాయం కాగా, సుగుణకు స్వల్ప గాయాలతో బయటపడింది. వీరిని కుటుంబ సభ్యులు జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. జనగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్, సుగుణ దంపతులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు శనివారం పరామర్శించారు.
బాధితులకు అండగా ఉంటామని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి రాంబాబు తన వాహనంలో పంపించి, ఆస్పత్రి నిర్వాహకులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కావటి భాస్కర్‌యాదవ్, తాటికొండ వెంకటేశ్‌యాదవ్, ధర్మానాయక్, వడ్లకొండ శివప్రసాద్, మంద కుమార్ ఉన్నారు.