13-02-2025 11:24:39 PM
నల్లగొండ (విజయక్రాంతి): అప్పుల బాధ తాళలేక ఉరేసుకొని రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఎర్రకాలువ తండాలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎర్రకాలువ తండాకు చెందిన నానావత్ హర్యా(50) తనకున్న ఎకరం 10 గుంటల భూమిలో భార్య లక్ష్మితో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఉదయం తన కూతురు అరుణకు ఫోన్ చేసి చూడాలని ఉందని పుట్టింటికి రావాలని కోరాడు. ఆ తరువాత పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హర్యా మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేశ్ తెలిపారు.