మేడ్చల్, సెప్టెంబర్ 6: పంట రుణం మాఫీ కాలేదనే మనస్థాపంతో ఓ రైతు వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలోనే ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకున్న ఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సోలిపేట్ సురేందర్ రెడ్డి(55) భార్య, ఇద్దరు పిల్లలతో మేడ్చల్‌లోని హౌజింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్నాడు. సురేందర్‌రెడ్డికి చిట్టాపూర్‌లో రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో ఎస్‌బీఐలో రూ.లక్షా 80వేల పంటరుణం తీసుకున్నాడు. ఇప్పుడది వడ్డీతో కలిపి రెండు లక్షలు దాటింది. సురేందర్ రెడ్డి తల్లికి రూ.లక్ష రుణం మాఫీ అయ్యింది. అయితే తల్లీ కొడుకుది ఒకటే రేషన్ కార్డు కావడంతో సురేందర్ రెడ్డి రుణం మాఫీ కాలేదు.
ఈ క్రమంలో ఎన్న ప్రభుత్వ కార్యాలయాలు తిరిగినా తన పంటరుణం మాఫీకాదని తెలవడంతో మనస్తానికి గురైన సురేందర్‌రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున మేడ్చల్ ఏడీఏ కార్యాలయ ఆవరణలో ఇనుప మెట్లకు ఉరివేసుకున్నాడు. మృతుడి వద్ద రెండు లేఖలు లభించాయి. ఒక లేఖలో ‘నాచావుకు కారణం చిట్టాపూర్ బ్యాంకులో రుణం మాఫీ కాలేదు’ అని ఆత్యహత్య అని, మరో లేఖలో ‘నా చావుకు కారణం అమ్మ’ అని రాసి ఉంది. అయితే ఈ రెండు లేఖలు ఎస్‌బీఐ లెటర్ ప్యాడ్ మీద రాసినవే కావడం గమనార్హం. మృతుడు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, దివంగత రామలింగారెడ్డి అన్న కుమారుడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యలు చేసుకోవద్దు..
గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్న రైతు సురేందర్‌రెడ్డి మృతదేహానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నివాళి అర్పించారు. రుణమాఫీ కాలేదని రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. రుణమాఫీపై రైతులెవరూ ఆందోళన చెందవద్దని.. పూర్తి రుణమాఫీ అయ్యేవరకు బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందనన్నారు. రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతును ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.