లోకం ఆకలి తీర్చ అన్నపూర్ణయైనా
పస్తులే అతడికున్న నిండు ఆస్తులు
మట్టి చెలిమిని మరువని ఆదిత్యుడు
పుట్లకొద్ది పంట పండించే కృషీవలుడైనా
పొట్టకూటికై పడిగాపులు గాస్తున్నాడు
సృష్టి ఆకలి తీర్చే కలియుగ సుధాముడు
పంటను పురుగుల నుంచి కాచినా
దళారుల చేతిలో దగా పడే అమాయకుడు
శ్రమ దోపిడీని ఆర్తిగా
సహిస్తున్న దానకర్ణుడు
ధరణిని దున్ని దివారాత్రులు శ్రమించి
నేలతల్లికీ పచ్చదనం అద్దుతాడు
సమస్త లోకానికి అన్నార్తిని తీర్చే భగీరథుడు
అప్పుల కుప్పలు ఉరితాళ్లను పేనుతుంటే
శాశ్వత నిద్ర శాంతియనీ తనువు చాలిస్తాడు
విషాదాన్నంతా దాచుకునే గరళకంఠుడు
రైతుబంధువులమనీ ప్రభుతలెన్ని వచ్చినా
గిట్టుబాటు మాత్రం గుట్టు చప్పుడవుతుంది
మార్కెట్ సభలో భంగపడే మానధనుడు
ఎరువు మందులు నకిలీవై వెక్కిరిస్తున్నా
కరువు గుండెలో చలనం పుట్టిస్తాడు
వెన్ను వంచి భువిని స్వర్గం చేసే అపర దధీచి
మండు వేసవిని పండు వెన్నెలగా భావించి
ఎండ తీవ్రతను
కండబలంగా చేసుకుంటాడు
పంట చేలే బృందాన వనంగా
చేసే భూపాలుడు
ఎండ, వాన, చలి ఏకమై వచ్చినా
చలించక హలం చేసి సిరులు పండిస్తాడు
స్థితప్రజ్ఞతే కవచమైన మనిషీ శ్వాసప్రదాత
పాడిపంటల వృద్ధియే పరమ పండుగలుగా
పాదధూళితో బీడును పాదరసం చేస్తాడు
పచ్చదనాన్నే దస్తూరి రాసే ఆదర్శమూర్తి.
ఐ. చిదానందం
8801444335