నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం పద్మనపల్లి గ్రామం బుధవారం చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే... లింగాల మండలం పద్మనపల్లి గ్రామంలో నవంబర్ 22వ తేదీన చోటు చేసుకోగా ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైతు శ్రీకాంత్ రెడ్డి తనకున్న 16 ఎకరాల పొలంలో వేరుశనగ పంటను సాగు చేశాడు. రోడ్డు పక్కనే ఉన్న హరితహారంల మొక్కలు ఏపుగా పెరిగి పంట పొలానికి అడ్డంగా ఉన్నాయన్న ఉద్దేశంతో రైతు ఈనెల 18న 22 చెట్లను నరికివేశాడు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి భానుచందర్ రూ.8వేలు జరిమానా విధిస్తూ రైతుకు నోటీసు జారీ చేశారు. దీంతో పాటు తనపై దుర్భాషలాడార అన్న కారణంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంబంధిత పోలీస్ స్టేషన్లోని ఓ కానిస్టేబుల్ ఫోన్ చేసి ఏడేళ్ల జైలు శిక్ష తప్పకుండా అనుభవించాల్సిందేనని బెయిల్ కూడా రాదంటూ జరిమానాతోపాటు మరో 50 వేలు అదనంగా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో కలత చెందిన శ్రీకాంత్‌రెడ్డి 22న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేసింది నిజమేనని కానీ పోలీస్ సిబ్బంది ఎవరు తనను బెదిరించలేదని ఎస్ఐ వివరణ ఇచ్చారు.