21-03-2025 12:35:19 AM
- వరి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వడంలేదని వ్యాపారి ఇంటి ముందు నిరసన పెట్రోల్ డబ్బాను లాక్కొని కాపాడిన పోలీసులు
నాగర్ కర్నూల్ మార్చ్ 20 విజయక్రాంతి: ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారి తమకు డబ్బులు ఇవ్వడం లేదని నిరసిస్తూ వ్యాపారి ఇంటి ముందు రైతులు నిరసన తెలిపారు. అందుకు పోలీసులు వ్యాపారుల వైపే మొగ్గు చూపారని నిరసిస్తూ యువ రైతు పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోనేందుకు యట్నిం చాడు.
అక్కడే ఉన్న పోలీసులు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బల్మూరు మండలం గోదల్ గ్రామానికి చెందిన కొందరు రైతులు పండించిన వరి ధాన్యాన్ని అదే గ్రామానికి చెందిన ఓ మధ్యవర్తి ద్వారా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన మనుసని శ్రీనివాసులు ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
కానీ నేటికీ ధాన్యం డబ్బులు 4.70 లక్షలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని గత నెల 11న అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మార్చి ఐదు వరకు పూర్తి డబ్బులు చెల్లిస్తానని ఒప్పంద పత్రం రాసిచ్చి మొఖం చాటేశాడు. దీంతో గురువారం రైతులంతా జిల్లా కేంద్రంలోని వ్యాపారి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను స్టేషన్ కి తరలించారు. దీంతో మనస్తాపం చెందిన రైతులు పోలీస్ స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారిని సముదాయించే క్రమంలో యువ రైతు పెట్రోల్ పోసుకోవడంతో పోలీసులు డబ్బాను లాక్కొని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.