వనపర్తి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): వనపర్తి కలెక్టరేట్ ఆవరణలో సోమవారం ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన రైతు సాయిరెడ్డికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో సాగు చేయకుండా అతడి అన్నదమ్ములు అడ్డుకుంటున్నారు.
ఈ విషయమై తనకు న్యాయం చేయాలని గతంలో పలుమార్లు ప్రజావాణిలో సాయిరెడ్డి విన్నవించుకున్నాడు. అయినా అధికారులు పట్టించు కోవడం లేదని మనస్థాపానికి గురైన సాయిరెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్పందించిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అక్కడ ఉన్న సిబ్బందితో సాయిరెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.