- 17.03లక్షల రైతుల ఖాతాల్లోకి డబ్బులు
- ఇప్పటి వరకు మొత్తం రూ.1,126.54 కోట్లు జమ
- యాసంగి సన్నాలకు బోనస్ కొనసాగుతుంది..
- మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను సర్కార్ జమ చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.
ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా కింద 17.03 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు చెప్పారు. రైతు భరోసా ప్రారంభోత్సవ రోజు జమ చేసిన నిధులతో కలిపి బుధవారం వరకు మొత్తం రూ.1,126.54 కోట్ల నిధులు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఇప్పటికే రైతుబంధుకు రూ.7,625 కోట్లు, రుణమాఫీకి రూ.20,616.89 కోట్లు, రైతుబీమాకు రూ.3 వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు.
యాసంగి సన్నాలకు బోనస్..
పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వానాకాలం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తులు ఉన్నాయని, ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఎన్నడూలేని విధంగా రూ.14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరలకు సేకరించినట్లు తెలిపారు.
రూ. 406.24 కోట్లతో సోయాబిన్, పెసళ్లు, కంది పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామన్నారు. పసుపు, మిరప పంటలకు మద్దతు ధర నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశామన్నారు.
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎరువుల కేటాయింపుల కోసం కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యం రైతే అని మంత్రి స్పష్టం చేశారు.