calender_icon.png 21 October, 2024 | 3:25 AM

రైతు భరోసాను నెలాఖరులోగా ఇవ్వాలి

21-10-2024 12:28:18 AM

  1. బీఆర్‌ఎస్ నేతల డిమాండ్
  2. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణుల ఆందోళన

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): రైతు భరోసా ఇవ్వబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ మాటా మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.

పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించి, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల దిష్టిబొమ్మలను దహనం చేశాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతు భరోసాను అన్నదాతల ఖాతాల్లో ఈ నెలాఖరులోగా జమ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

నిరసనల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే  పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వానాకాలం పంటకు భరోసా ఇవ్వకుండా తప్పించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, యాసంగి పంటకు పెట్టుబడి సాయం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తరహాలో ఇవ్వాలని సూచించారు.