calender_icon.png 21 October, 2024 | 12:40 AM

రైతు భరోసా వెంటనే ప్రకటించాలి

20-10-2024 02:56:21 PM

మందమర్రి (విజయక్రాంతి)రాష్ట్రంలోని రైతులందరికీ వర్షాకాలం రైతు భరోసా ప్రకటించక పోవడాన్ని నిరసిస్తూ వెంటనే రైతుబంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో బిఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం చెన్నూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కోటపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేసి ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దహనం చేశారు.జైపూర్ మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ..రైతులను నమ్మించి నట్టేట ముంచిన ఓటుకు నోటు దొంగ  రేవంత్ రెడ్డి అని తీవ్రంగా విరుచుకు పడ్డారు. రాష్ట్రంలోని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతుల ఓట్ల కోసం మొసలి కన్నీరు కార్చీ రైతు భరోసా కింద 15000 ఆమలు చేస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక వర్షాకాలపు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పడం ప్రభుత్వ సిగ్గుమాలిన తనానికి నిదర్శనమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు రైతు భరోసా పేరిట తెలంగాణ రైతాంగాన్ని నిలువునా మోసం చేశారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు విసిగిన ప్రజలు, రైతులు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడం తప్పదని చేతనైతే రైతులకు రైతు భరోసా వెంటనే ప్రకటించి, రుణ మాఫీ, రైతు భీమా అమలు చేయాలని, వచ్చే వరి పంటకు ప్రతి కింటాల్ వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు భరోసా, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు హైడ్రా పేరిట కూల్చివేతలకు తెరతీసిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.