calender_icon.png 24 December, 2024 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ సర్వే తర్వాతే రైతు భరోసా

06-11-2024 02:22:59 AM

  1. పది రోజులుగా నత్తనడకన సాగుతున్న సర్వే
  2. తగినంత సిబ్బంది లేకపోవడంతో ఆలస్యం
  3. ఇలా అయితే డిసెంబర్‌లో పెట్టుబడి సాయం కష్టమే 

హైదరాబాద్, నవంబర్ ౫ (విజయక్రాంతి): యాసంగి కోసం రైతు భరోసా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్వహించే డిజిటల్ క్రాప్ సర్వే నత్తనడకన సాగుతోంది. పది రోజుల నుంచి స్థానిక వ్యవసాయ శాఖ సర్వే చేస్తున్నా తగినంత సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వ టార్గెట్ పూర్తి కావడం లేదు.

తమకు సహాయకులను ఇవ్వాలంటూ ఉన్నతాధికారులను ఏఈవోలు కోరుతున్నారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం అందుకు నిరాకరిస్తున్నారు. ఈ సర్వేను జూలైలోనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల కారణంగా వాయిదా పడింది.

ఈ నేపథ్యంలోనే యాసంగి నుంచి పంట వివరాలను నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కానీ ఆశించిన స్థాయిలో నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 25 శాతం సర్వే కూడా పూర్తి కాలేదు. నవంబర్ నెలాఖరులోగా ఈ సర్వే పూర్తి చేస్త్తే డిసెంబర్ రెండో వారం నుంచి రైతు భరోసా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

సర్వే ప్రక్రియ ఇలానే నెమ్మదిగా కొనసాగితే జనవరిలో కూడా పెట్టుబడి సాయం అందడం కష్టమేనని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. తగినంత సిబ్బందిని కేటాయించి సర్వే త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో 68.99 లక్షల మంది రైతులకు 1.52 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఇందులో 73 శాతం మంది రైతులకు మూడు ఎకరాలలోపే ఉంది.

17 శాతం మందికి ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి ఉంది. కేవలం 10శాతం రైతులకు మాత్రమే ఐదెకరాలకంటే ఎక్కువ భూమి ఉంది. పంటసాగు చేయని వాళ్లు కూడా గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పొందారని ప్రభుత్వం గుర్తించింది. గత బీఆర్‌ఎస్ పాలనలో 40 శాతం రైతు బంధు నిధులు అనర్హులకే చేరినట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది.

కేవలం పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే పెట్టబడి సాయం అందిస్త్తే అన్నదాతలను ఆదుకోవడంతోపాటు ఖజానాకు భారం తగ్గుతుందనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలోనే పంటలు సాగుచేస్తున్న భూములకు సంబంధించిన సర్వే నంబర్లు,  సబ్ సర్వే నంబర్లను ఫొటో తీసి డిజిటల్ సర్వే యాప్ నమోదు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకుంది. 

యాసంగి పంటల వివరాల నమోదు 

వానాకాలం పంటలను సర్వే చేసేందుకు వీలు లేకపోవడంతో యాసంగి సీజన్‌లో పంటల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్దమైంది. చేన్ల వద్దకు వెళ్లకుండా పాత గణాంకాలు పరిగణలోకి తీసుకుని ఉంటే గతం కంటే నాలుగైదు శాతం పంట విస్తీర్ణం పెరిగేది. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వివరాల మధ్య తేడా కనిపించేంది. పథకం అమలులో సమస్యలు తలెత్తేవి. అటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో రైతు పండించే పంటతోపాటు వారికి సంబంధించిన పూర్తి వివరాలను డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా సేకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. ఈ సర్వేలో భాగంగా భూమి సర్వే నంబర్ల ప్రకారం రైతు సాగు చేసిన పంటలను ఫొటో తీయడంతోపాటు ఏ రకమైన పంటను ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే వివరాలను సేకరిస్తున్నట్టు వెల్లడించారు. ముందుగా మెదక్, నారాయణపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో సర్వే ప్రారంభించిన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా యాసంగి సీజన్ నుంచి డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించాలనే నిర్ణయం తీసుకుందని చెప్పారు. క్రాప్ సర్వే నిర్వహించడానికి గ్రామానికి 10 మంది సిబ్బందిని నియమిస్తే వారం రోజుల్లో పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు. కానీ సరిపడ సిబ్బంది లేకపోవడంతో సర్వే ఆలస్యం అవుతున్నట్టు వివరించారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో కొంత మందిని నియమించుకుని వారి సహాయంతో సర్వేను త్వరగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించినప్పటికీ ప్రభుత్వం నుంచి అందుకు అనుమతి రాలేదన్నారు.

 గ్రామాల్లో సర్వే విధానం

్ర గామ సర్వే నంబర్లను, భూముల హద్దులతో కూడిన మ్యాపులను ధరణి పోర్టల్ నుంచి వ్యవసాయ శాఖ డిజిటల్ క్రాప్ సర్వే యాప్‌లో డౌన్ లోడ్ చేసుకుంటుంది. అనంతరం సర్వే నంబర్లు, సబ్ సర్వే నంబర్ల ప్రకారం పంట వివరాలను అధికారులు నమోదు చేస్తారు.

ఏ ఒక్క సబ్ సర్వే నంబరును మర్చిపోవడానికి వీలు లేదు. అదేవిధంగా పంట చేను దగ్గరికి వెళ్లి మాత్రమే ఫొటో తీయాలి. దూరంగా ఉండి ఫొటో తీస్తే అవి యాప్‌లో అప్‌లోడ్ చేయడానికి అవకాశం ఉండదు. దీనిని పకడ్బందీగా అమలు చేస్తే కచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయవచ్చు.