- ఏఈవోల సహాయంతో వివరాల సేకరణ
- సాంకేతికత వినియోగానికి సర్కారు సిద్ధం
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా అందించడం ప్రభుత్వ ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో రైతు భరోసా పథకంలో సాగు విస్తీర్ణాన్ని గుర్తించేందుకు పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. సాగు చేసిన భూముల వివరాలను ఏఈవోల ద్వారా ఎప్పటికప్పుడు రైతుల వారీగా నమో దు చేస్తామన్నారు. అదేవిధంగా పథకం అమలులో కచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటాలో గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా సాగులో ఉన్న భూముల విస్తీర్ణాన్ని గుర్తిస్తామన్నారు.
సాగుకు అనువుగా లేని భూముల విస్తీర్ణంతోపాటు.. ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో తెలుసుకోవడం వల్ల రైతుభరోసా పథకం అమలుకు, భవిష్యత్తులో పంటల భీమా అమలుకు ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా పంటల ఆరోగ్య స్థితి, ఎదుగుదల, చీడపీడలను ఆరంభంలోనే గుర్తిం చడం, వరదలతో జరిగే పంటనష్టాన్ని అంచ నా వేయడంలో నూతన సాంకేతికను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు.
ఈ సందర్భంగా ఆయా కంపెనీల ప్రతినిధులు ఇదివరకు తాము చేపట్టిన ప్రాజెక్ట్ వివరాలతో పాటు, నమూనాగా వారు తయారుచేసిన రెండు మండలాల సాగు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సాగుకు అనువు గాని ప్రాంతాలను డిజిటల్ మ్యాప్స్ ద్వారా, పంటల్లో చీడపీడలను ఆరంభంలో గుర్తించేందుకు ‘ఏఐ’తో తయారు చేసిన మోడల్స్‌ను వివరించారు.
అనంతరం పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని కంపెనీల ప్రతినిధులకు మంత్రి సూచించారు. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ వీటన్నింటిని పరిశీలించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు క్యాబినెట్ ఆమోదానికి పంపిస్తామన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.