calender_icon.png 17 October, 2024 | 2:29 AM

యాసంగికి రైతు భరోసా

17-10-2024 12:19:31 AM

ఎకరానికి రూ.7,500 ఇస్తాం

ఈ నెలాఖరుకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి

రైతుబీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

నల్లగొండ, అక్టోబర్ 16 (విజయక్రాంతి): రైతు భరోసా పథకం కింద ఈ యాసంగి నుంచే రైతులకు ఎకరానికి రూ.7,500 పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించారు.

నల్లగొండ పట్టణ శివారులోని బత్తాయి మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి బుధవారం తుమ్మల ప్రారంభించారు. అనంతరం తుమ్మల మాట్లాడారు. ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షలలోపు రుణాలను ఈ నెలాఖరు నాటికి మరో 4 లక్షల మందికి మాఫీ చేసి ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

రూ.2 లక్షలకుపైగా రుణాలను సైతం మాఫీ చేసేందుకు త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. వచ్చే నెలలోపు రూ. 31 వేల కోట్ల రైతు రుణాల చెల్లింపు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఏడాది నుంచి రైతుల పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని, పంట నష్టపోయిన వారికి వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ ఏడాది రాష్ట్రంలో కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని అంచనాలున్నాయని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలున్నందున రైతులు అటు వైపు దృష్టి సారించాలని మంత్రి తుమ్మల సూచించారు. నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో సాగు చేశారని ఎకరానికి లక్షన్నర నుంచి రెండు లక్షల ఆదాయం వచ్చే అవకాశముందని తెలిపారు.

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తామని, విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచుతామని పేర్కొన్నారు.  కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్‌లో ఆయిల్ పామ్ పరిశ్రమలు నెలకొల్పుతామని వెల్లడించారు. 

కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి: మంత్రి కోమటిరెడ్డి 

ఎస్సెల్బీసీ వద్ద గతంలో బత్తాయి మార్కెట్‌లో నిర్మించిన షెడ్డులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వ్యవసాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏపీలోని అనంతపురం తర్వాత నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 50 వేల ఎకరాల్లో బత్తాయి పండుతుందని గుర్తు చేశారు.

అనంతరం మంత్రులు నిడమనూరు, హాలియా మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరై పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ నారా యణరెడ్డి, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్‌రావు, ఎస్పీ శరత్‌చంద్రపవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్‌గౌడ్ పాల్గొన్నారు.