దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్
నల్లగొండ, జనవరి 24 (విజయక్రాంతి) : సాగు యోగ్యమైన ప్రతీ ఎకరాకు ప్రభుత్వం రైతుబంధు సాయం అందిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ స్పష్టం చేశారు. కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. డిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అంతకముందు పీఏపల్లి మండలం యల్లాపురం, పెద్దగట్టు గ్రామాల్లో రూ. 30లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఆర్డీఓ రమణారెడ్డి, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.