వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నల్లగొండ, జనవరి 12 (విజయక్రాంతి): రైతులు సాగు చేస్తున్న ప్రతీ ఎకరాకు రైతు భరోసా రూ.12 వేలు అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో అన్నదాతల సంక్షేమానికి రూ. 40 కోట్లు వెచ్చిందని పేర్కొన్నారు. నల్లగొండ కలెక్టరేట్‌లో ఆదివారం ఉమ్మడి జిల్లాలో రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. జనవరి 16 నుంచి 20 వరకు రెవెన్యూ గ్రామాల వారీగా భూ రికార్డులు పరిశీలించి, 21 నుంచి 24 వరకు పంచాయతీల వారీగా గ్రామసభలు నిర్వహించి సాగులో లేని భూముల వివరాలు గుర్తించనున్నట్లు తెలిపారు. ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలున్న రైతులకూ రైతు భరోసా ఇస్తామని చెప్పారు.
పేదల అభ్యున్నతే ధ్యేయం: కోమటిరెడ్డి
రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేండ్లలో నల్లగొండ నియోజకవర్గంలో 797 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించినా లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు బాలూనాయక్, జైవీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఉత్తమ్ పద్మావతి, వేముల వీరేశం, మందుల సామేల్, కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హన్మంతరావు, తేజస్ నంద్‌లాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు.