calender_icon.png 30 September, 2024 | 4:53 AM

దసరాకు రైతు భరోసా

30-09-2024 02:33:15 AM

ఐదెకరాలలోపు ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు

ఎకరానికి పంటకు రూ.7,500 చొప్పున..

పంటలు సాగు చేసిన భూములకే సాయం 

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): దసరాకు రైతు భరో సా నిధులను అన్నదాతల ఖాతాల్లో వేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. ముందుగా ఐదెకరాలలోపు ఉన్నవా రికి జమ చేయనున్నారు. వానాకా లం పంట పెట్టుబడి సాయం అందిం చని సర్కార్.. యాసంగి పంటకు మాత్రం తగిన నిధులను సమకూర్చింది.

గత ప్రభుత్వం తరహాల్లో కాకుండా పేద, మధ్యతరగతి రైతులను దృష్టిలో పెట్టుకొని గరిష్ఠంగా ఏడున్నర ఎకరాలపు రైతులకు సాయం ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. రెండు నెలల క్రితం భరోసా పంపిణీపై విధివిధానాలు రూపొందించేందుకు ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీ వేశారు. కమిటీ పదిరోజుల పాటు రాష్ట్రమంతా పర్యటించి పంటసాగు చేసే రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది.

ఈసారి రైతు భరోసా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. పంటకు ఎకరాకు రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా రెండు రోజుల్లో రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

పండావు, రాళ్లురప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు, భూసేకరణ కింద పోయిన భూములను భరోసా జాబితా నుంచి తొలగించారు. రాష్ర్ట వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఈ వానాకాలంలో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు వేయగా, అందులో వరి, పత్తి పంటలు పెద్దమొత్తంలో సాగు చేశారు.

రైతులు ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేశారో ఇప్పటికే రికార్డులు నమోదు చేశారు. దాని ప్రకారమే పంట కొనుగోళ్లు కూడా చేపట్టనున్నారు. ప్రభుత్వం పంటలు వేసిన భూములకు ఎకరాకు రూ.7500 చొప్పున రైతు భరోసా ఇస్తే దాదాపు రూ.10 వేల కోట్లు అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 

వ్యవసాయేతర భూములకు సాయం బంద్

ఇప్పటి నుంచి పంటసాగు చేసే భూములకు తప్ప వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే భూములతో పాటు పంటలు సాగు చేయని 20 లక్షల ఎకరాలను రైతు భరోసా జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.

దీంతో ప్రభుత్వానికి రూ.1500 కోట్ల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు ప్రారంభించిన నాటి నుంచి గత వానాకాలం సీజన్ వరకు దాదాపు రూ.73 వేల కోట్లు పెట్టుబడి సాయం అందించారు.

గుట్టలు, రహదారులు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రూ.25 వేల కోట్లు చెల్లించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఇకా నుంచి పంట సాగు చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిలా నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.