calender_icon.png 26 October, 2024 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసా, పంటల బీమా వెంటనే అమలు చేయాలి

28-08-2024 05:05:28 PM

జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌

ఖమ్మం, (విజయక్రాంతి): రైతు భరోసా, సమగ్ర పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన సిపిఎం జిల్లా కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సీజన్‌ ప్రారంభమై 4 మాసాలు అవుతున్నా ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేయటంలో విఫలమైందన్నారు. పెట్టుబడులు అందక రైతులు ఆందోళన పడుతున్నారని, పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కిసాన్‌ సమ్మాన్‌ యోజన రైతులకు ఉపయోగపడకపోగా, కంపెనీలకు లాభాలు తెచ్చి పెడుతుందని, తెలంగాణలో సమగ్ర పంటల బీమా పథకాన్ని రూపొందించాలని ఆయన కోరారు. డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాలకు గ్రామాలే జ్వరాలు, నొప్పులతో కునారిల్లుతున్నాయని, హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి వైద్య సేవలు విస్తృతపరచాలని ప్రభుత్వాన్ని కోరారు.

సత్తుపల్లిలో సిపిఐ (ఎం) జిల్లా మహాసభలు

సిపిఐ (ఎం) పార్టీ జిల్లా మహాసభలు డిసెంబర్‌ రెండో వారంలో సత్తుపల్లి పట్టణంలో జరుగుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రకటించారు. జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరచటం, ప్రజా ఉద్యమాల రూపకల్పన ద్వారా ప్రజా పునాదిని పెంచే లక్ష్యంతో ఈ సభల్లో చర్చిస్తామన్నారు. దేశవ్యాపితంగా మహాసభల షెడ్యూల్‌ను పార్టీ కేంద్ర కమిటి ప్రకటించిందన్నారు. వచ్చే సెప్టెంబర్‌ నెలలో శాఖా మహాసభలు పూర్తిచేయాలని, అక్టోబర్‌లో మండలస్థాయిలో, డిసెంబర్‌ లోపు జిల్లా మహాసభలు, జనవరిలో రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి పట్టణంలో జరుగుతాయని నున్నా వివరించారు. ప్రభుత్వాలు కుంటి సాకులతో రుణమాఫీని అమలు పరచటంలో కాలయాపన చేస్తుందని విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు షరతులు లేకుండా రుణమాఫీ అమలు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో రుణమాఫీ కోరుతూ పాదయాత్రలు చేయాలని నున్నా పిలుపునిచ్చారు.