రిటైర్మెంట్ ప్రకటించిన దీపా కర్మాకర్
- ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి జిమ్నాస్ట్‌గా రికార్డు
- రియోలో తృటిలో పతకం మిస్
* అవి 2016 రియో ఒలింపిక్స్ మహిళల జిమ్నాస్టిక్ ఫైనల్స్.. సిమోన్ బైల్స్, గాబీ డగ్లస్, అలీ రెయిస్‌మన్ లాంటి స్టార్ల మధ్య ఆమె పోటీలో నిలబడింది. పోల్ వాల్ట్ ఈవెంట్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ క్వాలిఫికేషన్‌లో టాప్-8లో నిలిచి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో అద్వితీయ ప్రదర్శన కనబరిచిన ఆ అమ్మాయి కేవలం 0.15 పాయింట్ల తేడాతో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది.
ఈ ఒక్క ప్రదర్శనతో భారత్‌లో ఆమె పేరు మార్మోగిపోయింది. ఆడింది ఒక్క ఒలింపిక్స్ అయినప్పటికీ పేరును ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది.. అగర్తల ముద్దుబిడ్డ దీపా కర్మాకర్.. 31 ఏళ్ల వయసులో విన్యాసాలకు సెలవు ప్రకటించిన దీపాకు అల్విదా..!
* ‘చాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. రిటైర్మెంట్ అనేద కఠిన నిర్ణయం. కానీ వీడ్కోలుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన 2016 ఏడాదిని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఇన్నాళ్లు నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యావాదాలు.. థాంక్యూ’
దీపా కర్మాకర్
న్యూఢిల్లీ: భారత మహిళా జిమ్నాస్ట్‌గా మన్ననలు పొందిన దీపా కర్మాకర్ సోమవారం జిమ్నాస్టిక్ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించింది. దేశం తరఫున ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్ క్రీడలో పాల్గొన్న తొలి అథ్లెట్‌గా 31 ఏళ్ల దీపా కర్మకర్ చరిత్రకెక్కింది. 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న దీపా వాల్ పోల్ట్ ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది.
ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాజధాని అగర్తలలో పుట్టిన దీపా కర్మాకర్ గ్లాస్కో వేదికగా 2014లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో జిమ్నాస్టిక్ వాల్ట్ ఫైనల్లో కాంస్య పతకం సాధించింది. తద్వారా కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున జిమ్నాస్టిక్ విభాగంలో పతకం గెలిచిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా దీపా రికార్డులకెక్కింది. మరుసటి ఏడాది హిరోషిమా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో వాల్ట్ ఈవెంట్‌లో మరో కాంస్యంతో మెరిసింది.
సస్పెన్షన్ అనంతరం ఈ ఏడాది తష్కెంట్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో ఏకంగా స్వర్ణ పతకం కొల్లగొట్టడం విశేషం. 2015లో ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆర్టిస్టిక్ జామ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా రికార్డులకెక్కింది. 2018లో టర్కీ వేదికగా జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ వరల్డ్‌కప్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన దీపా ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది.
అదే ఏడాది జర్మనీ వేదికగా జరిగిన మరో ప్రపంచకప్‌లో కాంస్యంతో సత్తా చాటింది. జిమ్నాస్టిక్ క్రీడలో సత్తా చాటిన దీపాను భారత ప్రభుత్వం.. క్రీడా అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర అవార్డుతో పాటు పద్మశ్రీ, అర్జున అవార్డులతో గౌరవించింది.
‘వాల్ట్ ఆఫ్ డెత్’
ఆరేళ్ల వయసులోనే జిమ్నాస్టిక్‌పై ప్రేమను పెంచుకున్న దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్ క్రీడలో అత్యంత కఠినమైన గేమ్‌గా పిలుచుకునే ప్రొడునోవా వాల్ట్‌ను కెరీర్‌గా ఏంచుకుంది. జిమ్నాస్టిక్ చరిత్రలోనే ప్రొడునోవా వాల్ట్ ఈవెంట్‌లో సక్సెస్ అయిన ఐదుగురిలో దీపా కర్మాకర్ ఉండడం విశేషం.
‘వాల్ట్ ఆఫ్ డెత్’గా పరిగణించే వాల్ట్ పోల్ ఈవెంట్‌లో మ్యాట్‌పై ల్యాండ్ అవ్వడానికి రెండు సోమర్‌సాల్ట్ వేయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఏ మాత్రం అదుపు తప్పినా మెడ విరిగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వాల్ట్ ఈవెంట్‌లో పాల్గొనడానికి జిమ్నాస్ట్‌లు దైర్యం చేయరు. కానీ దీపా మాత్రం వాల్ట్‌లో సత్తా చాటడం విశేషం.
తృటిలో పతకం మిస్..
2016 రియో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా నిలిచిన దీపా కర్మాకర్ అంచనాలకు మించి రాణించింది. ఫ్లోర్ ఎక్సర్‌సైజ్, బ్యాలెన్స్ బీమ్, మహిళల వ్యక్తిగత రౌండ్‌లో నిరాశపరిచినప్పటికీ వాల్ట్ ఈవెంట్‌లో మాత్రం అదరగొట్టిన దీపా క్వాలిఫికేషన్‌లో 14.850 స్కోరు చేసి టాప్-8లో నిలిచింది. తద్వారా ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక ఫైనల్లో బైల్స్, డగ్లస్ లాంటి స్టార్లతో పోటీ పడిన దీపా 15.066 పాయింట్లు స్కోరు చేసి కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్యం చేజార్చుకుంది.
డోపింగ్‌లో పట్టుబడి..
ఎలాంటి ఎత్తు పళ్లాలు లేకుండా కెరీర్ సాఫీగా సాగుతున్న దశలో 2021లో దీపా కర్మాకర్ డోపింగ్‌లో పట్టుబడడం కెరీర్‌లో మాయని మచ్చగా మిగిలిపోయింది. తనకు తెలియకుండానే నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు తేలడంతో ఆమెపై వేటు తప్పలేదు.
డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలడంతో ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెపై 21 నెలల నిషేధం విధించింది. గతేడాది జూన్‌లో నిషేధం ముగియడంతో తిరిగి మ్యాట్‌లో అడుగుపెట్టి ఈ ఏడాది తష్కెంట్ వేదికగా జరిగిన ఆసియా చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణంతో మెరవడం విశేషం.