calender_icon.png 11 October, 2024 | 5:00 AM

మార్గదర్శికి వీడ్కోలు

11-10-2024 02:50:29 AM

పారిశ్రామిక దిగ్గజానికి ముగిసిన అంత్యక్రియలు

మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహణ 

పార్సీ సంప్రదాయం ప్రకారం కార్యక్రమం

నివాళులు అర్పించిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు

రతన్‌టాటాకు భారతరత్న ఇవ్వాలి 

మహారాష్ట్ర మంత్రిమండలి తీర్మానం

గురువారం మహారాష్ట్రలో సంతాపదినం 

పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం 

బ్రిటన్ రాణి ఆహ్వానం కన్నా మూగజీవాల ప్రేమే మిన్న

స్వప్నలోకాలకు..

ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహణ

హాజరైన రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు

కేంద్రం తరఫున అమిత్ షా, గోయల్ నివాళులు

జనసాగరమైన 12 కిలోమీటర్ల అంతిమయాత్ర

భారత పారిశ్రామిక రంగంలో ఒక స్వాప్నికుడి శకం ముగిసింది. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో దేశానికే వన్నె తెచ్చిన మేధావి, దాతృత్వంలో అభినవ కర్ణుడిగా కీర్తింపబడిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు దేశం గురు వారం తుది వీడ్కోలు పలికింది. అనారోగ్యంతో బుధవారం రాత్రి మరణించిన రతన్‌టాటా పార్థివదేహానికి ముంబైలోని వర్లీ స్మశానవాటికలో పార్సీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్‌గోయెల్ తదితర రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. ఎన్సీపీఏ నుంచి వర్లీ వరకు 12 కిలోమీటర్ల దూరం సాగిన అంతిమయాత్రలో వేలమంది ప్రజలు పాల్గొన్నారు. రతన్ టాటాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మహారాష్ట్ర క్యాబినెట్ తీర్మానంచేసి కేంద్రానికి పంపింది. 

ముంబై, అక్టోబర్ 10: భారత పారిశ్రామిక దిగ్గజం, మానవతా మూర్తి రతన్ టాటాకు దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించిన టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా పార్ధివ దేహానికి గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్‌గోయల్ హాజరయ్యారు. రతన్ టాటాకు వందలమంది రాజకీ, సినీ, వ్యాపార దిగ్గజాలతోపాటు వేలమంది సామాన్యులు తుది వీడ్కోలు పలికారు.  రతన్ టాటా పెంపుడు శునకం ఆయన పార్థివదేహం వద్దనే కూర్చొని కదలకపోవటం అక్కడున్నవారి మనసులను మెలిపెట్టింది.

పార్సీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు

బుధవారం రాత్రి బ్రీచ్‌క్యాండీ దవాఖానలో తుది శ్వాస విడిచిన రతన్‌టాటా పార్ధివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం గురువారం ఉదయం 10.30 గంటలకు దక్షిణ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ)కు తరలించారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంచారు.

రతన్ టాటాకు నివాళులు అర్పించేందుకు ఉదయం నుంచే ప్రముఖులతోపాటు సామాన్య ప్రజలు తరలివచ్చారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఆ రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తదితర ప్రముఖులు, బాలీవుడు దిగ్గజాలు రతన్‌టాటాకు నివాళులు అర్పించారు.

అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు వర్లీలోని స్మశానం వరకు 12 కిలోమీటర్లు అంతిమ యాత్ర కొనసాగింది. దారిపొడవునా ప్రజలు రెండువైపులా నిలబడి వీడ్కోలు పలికారు. వర్లీలోని స్మశానంలో పార్సీ ఆచారాలను అనుసరించి విద్యుత్తు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 

రతన్‌టాటాకు భారత రత్న ఇవ్వాలి

భారత పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేసిన రతన్ టాటా గౌరవార్ధం మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాపదినంగా ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను అవనతం చేయాలని సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదేశించారు. రతన్‌టాటాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. సీఎం షిండే అధ్యక్షతన గురువారం సమావేశమైన మహారాష్ట్ర క్యాబినెట్.. రతన్‌టాటాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసింది.  

కలియుగ కర్ణుడు

భారత్‌లో కుబేరులు ఎవరంటే అంబానీలు, అదానీలని టక్కున చెప్పేస్తాం.. కానీ, 150 ఏండ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూప్ నుంచి ఒక్కరు కూడా ఈ జాబితాలో కనిపించరు. అందుకు కారణం వారి దాతృత్వ కార్యక్రమాలే. టాటా గ్రూప్‌లోని టాటాల ఆదాయంలో 60 నుంచి 65 శాతం నేరుగా టాటా ట్రస్ట్‌కు వెళ్తుంది. అందుకే రతన్ టాటా ధనవంతుల జాబితాలో కనిపించలేదు. రతన్ టాటా చనిపోయే నాటికి ఆయన పేరుపై రూ.4 వేల కోట్లకంటే తక్కువగానే ఆస్తి ఉన్నట్లు సమాచారం. రతన్ టాటా ఆస్తికిగానీ, టాటా గ్రూప్‌నకు గానీ వారసుడిని ప్రకటించలేదు. 

మూగజీవాల ప్రేమికుడు

రతన్‌టాటాలో ఇది మరోకోణం

వీధి కుక్కలకు బాంబే హౌస్‌లో ప్రత్యేక గది n అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం

తన పెట్ కోసం బ్రిటన్ రాణిని కలిసే అవకాశాన్ని వదులుకున్న టాటా

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: భారత పారిశ్రామిక రంగ గతిని మార్చడంతో పాటు మానవీయ కోణంలోనూ రతన్‌టాటా కృషి ప్రశంసనీయం. జంతువులపైనా ఆయన ఎంతో కరుణ చూపించారు. వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించేందుకు తన ప్రధాన కార్యాలయం బాంబై హౌస్‌లో ఓ గదిని కేటాయించారు.

దేశంలోనే మూగజీవాల కోసం అత్యాధునిక ఆసుపత్రిని సైతం ప్రారంభించారు. బ్రిటన్ రాణి చేతుల మీదుగా అవార్డు తీసుకోవటానికి వెళ్లేముందు తన పెంపుడు కుక్క అనారోగ్యం పాలవడంతో ఆ పర్యటనను సైతం రద్దు చేసుకున్నారంటే ఆయన ఎంత జంతు ప్రేమికులో అర్థమవుతుంది.  

మూగజీవాల కోసం పోస్టులు

1. మా ఆఫీస్ గత రాత్రి తప్పిపోయిన కుక్కను ముంబై సియాన్ హాస్పిటల్‌లో గుర్తించింది. దీని యజమానులు ఉంటే ఏవైనా ఆధారాలతో మెయిల్ చేయండి. లేదా తను మా సంరక్షణలో ఉంటుంది. దాని గాయాలకు మేం చికిత్స చేస్తాం.

2. ఇప్పుడు వర్షాకాలం. చాలా వీధికుక్కలు, పిల్లులు వర్షం నుంచి సంరక్షణ కోసం కార్ల కింద తలదాచుకుంటాయి. కారు స్టార్ట్ చేసేముందు ఒకసారి కింద గమనించండి. అందువల్ల మూగజీవాల ప్రాణాలు కాపాడివారవుతాం. అవసరమైతే వాటికి ఓ ఆశ్రయం కల్పించే ప్రయత్నం చేయండి.     

3. 2021లో వర్షం పడుతున్నప్పుడు ఓ తాజ్ హోటల్ ఉద్యోగి వీధికుక్కకు గొడుగు పట్టిన ఫొటోను టాటా షేర్ చేశారు.  

4. ఈ దీపావళికి దత్తత తీసుకున్న బాంబే హౌస్ శునకాలతో కొన్ని హృదయపూర్వ క్షణాలు. ముఖ్యంగా గోవాలోని నా కొలీగ్ కూడా దత్తత తీసుకున్నారు అని ఓ పెట్ డాగ్‌తో ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. 

5. శునకాల గురించి తన చివరి పోస్టులో ఏడు నెలల వయసు గల కుక్కకు రక్తమార్పిడికి సహకరించిన నాలుగు కుక్కలతో వాటి యజమానులకు టాటా ధన్యవాదాలు తెలిపారు. 

తాజ్ ప్రవేశద్వారం వద్ద వీధికుక్క

సెలబ్రిటీలు, ప్రముఖు వ్యక్తులు నిత్యం వచ్చే ముంబైలోని తాజ్ హోటల్ ప్రవేశద్వారం వద్ద ఓ వీధికుక్క ఉంటుంది. దీన్ని గమనించిన ఓ మహిళ హోటల్ సిబ్బందిని ఆరా తీయగా.. అది పుట్టినప్పటినుంచి ఇక్కడే ఉంటోంది. హోటల్‌లో తను ఓ భాగం. ఇక్కడివచ్చే ఏ మూగజీవాన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్‌టాటా నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి అని వివరించినట్లు ఆమె తన లింక్డ్‌ఇన్‌లో రాసుకొచ్చారు. 

పెట్ అనారోగ్యం వల్ల బ్రిటన్ పర్యటన రద్దు

బ్రిటన్ రాణి దివంగత ఎలిజబెత్-2 నుంచి ఓ అవార్డు స్వీకరించేందుకు వెళ్లాల్సిన రతన్‌టాటా తన పెంపుడు కుక్క అనారోగ్యం పాలు కావడంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారని ప్రముఖ వ్యాపారవేత్త నిరంజన్ హీరానందాని తెలిపారు. ఆ విషయం తెలిసి తామంతా ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. దాన్ని తన బెడ్‌పైనే పడుకోబెట్టుకుని జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పారు.  

నాలుగు సార్లు పెళ్లి దాకా వెళ్లి..

  1. చైనా యుద్ధం వల్ల అమెరికా ప్రేయసి దూరం
  2.  ప్రముఖ నటి సిమితోనూ గతంలో డేటింగ్ 
  3. చివరివరకూ బ్రహ్మచారిగానే ఉండిపోయిన టాటా

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌టాటా ఆజన్మ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. అలా అని ఆయన జీవితంలో ప్రేమ కోణం లేదని కాదు. అమెరికాలోని ప్రియురాలితో 1960లలో చైనా యుద్ధం కారణంగా పెళ్లి ప్రయత్నం విఫలమైందని ఆయనే చెప్పారు.  రతన్‌టాటా ఎక్కువగా మాట్లాడరు.

కానీ నాలుగుసార్లు పెళ్లి దాకా వెళ్లి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని మరొక సందర్భంలో రతన్ టాటానే వెల్లడించారు. ఓసారి అయితే పెళ్లి పత్రికల దాకా వెళ్లినా బంధంలోకి అడుగుపెట్టలేకపోయినట్లు వివరించారు. కానీ కొన్ని సమయాల్లో భార్య, కుటుంబం ఉండాలని కోరుకున్నట్లు ఒప్పుకున్నారు. కుటుంబం లేని కారణంగా చాలాసార్లు ఒంటరితనాన్ని అనుభవించానని తెలిపారు.  

సినీ నటితో డేటింగ్!

బాలీవుడ్‌లో బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి సిమి గరేవాల్‌తో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆధునిక భావాలు కలిగిన కుటుంబంలో పుట్టిన ఆమె అప్పట్లో యువతను ఉర్రూతలూగించింది. ఈ విషయాన్ని 2011లో సిమి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఆమెకు 76 ఏళ్లు. టాటా మరణవార్త వినగానే ఉద్వేగానికి లోనయిన సిమి ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. నువ్వు వెళ్లిపోయావని అందరు చెబుతున్నారు. నువ్వు లేవనే ఈ లోటును భరించడం చాలా కష్టంగా ఉంది. వీడ్కోలు మిత్రమా అని హృదయవిదారకంగా స్పందించింది.  

చైనా యుద్ధంతో

అమెరికాలో తాను ప్రేమించిన అమ్మాయి విషయానికి వస్తే 1962లో చైనా యుద్ధం తమను విడదీసిందని టాటా వెల్లడించారు. తల్లిదండ్రులు విడిపోవడంతో టాటాను ఆయన అమ్మమ్మ పెంచింది. అయితే పూర్తిగా              అమెరికాలోనే           స్థిరపడాలని భావించిన ఆయన.. ఆమె అనారోగ్యం కారణంగా ఇండియాకు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో భారత్, చైనా యుద్ధం జరుగుతుండటంతో ఆ యువతి తల్లి దండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తాము విడిపోయినట్లు టాటా తెలిపారు. భారత్‌కు వచ్చిన తర్వాత టాటా సంస్థ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది.

హైదరాబాద్‌తో టాటా బంధం

  1. ఆదిబట్లలో టాటా బోయింగ్ ఏరోస్పేస్
  2. రతన్ టాటా చేతుల మీదుగా టీహబ్ ప్రారంభం
  3. ఆదిబట్ల అప్రోచ్ రోడ్డుకు రతన్ టాటా పేరు?

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు హైదరాబాద్‌తో మంచి అనుబంధం ఉంది. టాటా సంస్థల ఏర్పాటుకు ఇక్కడి ప్రభుత్వాలతో ఆయన సన్నిహిత సంబంధాలను కొనసాగించారు.

ఆయన టాటా గ్రూప్ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే హైదరాబాద్‌లో టీసీఎస్‌తోపాటు తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వైమానిక సెజ్ (ఆదిబట్ల)లో టాటా బోయింగ్ ఏరోస్పేస్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సంస్థకు 2016లో అప్పటి కేంద్ర మంత్రి మనోహర్ పారికర్, రతన్ టాటా శంకుస్థాపన చేయగా, 2018లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.  

రతన్ టాటా చేతుల మీదుగా టీ ప్రారంభం

స్టార్టప్‌లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం స్థాపించిన స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టీ టాటా గ్రూప్ చైర్మన్ హోదాలో రతన టాటా 2015లో నాటి మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు. టీనుఘహబ్‌లో రాష్ట్ర యువ పారిశ్రామికవేత్తలతో పాటు స్టార్టప్ ఇంక్యుబేటర్స్‌తో ఆయన భేటీ అయ్యారు. స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఖచ్చితమైన మార్గం లేదని, అయితే ప్రమోటర్ల నిబద్ధత, అభిరుచి, విశ్వాసంతో పెట్టబడులు ప్రభావితమై ఉంటాయని తెలిపారు. 

ఆదిబట్ల రోడ్డుకు రతన్ టాటా పేరు?

రతన్ టాటాకు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌తో మంచి అనుబంధం ఉందని రాష్ట్ర మంత్రి వ్రీధర్ బాబు ఎక్స్‌లో తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై డ్రైవ్ చేస్తున్న సమయంలో దీనిపై ఓ విమానంను ల్యాండ్ చేయగలని ఆయన వ్యాఖ్యానించినట్లు గుర్తు చేశారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి ఆదిబట్ల వరకు ఉన్న అప్రోచ్ రోడ్డుకు రతన్ టాటా మార్గ్‌గా పేరు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

టాటా ‘రత్నాలు’

* నీ మీదికి ఎవరైనా రాళ్లు విసురుతున్నట్టయితే వాటిన్నింటినీ సేకరించి ఎప్పటికీ గుర్తుండిపోయే సౌధాన్ని నిర్మించు. 

* జీవితంలో ఎదరయ్యే ఎత్తుపల్లాలే మనం ముందుకు సాగటానికి చాలా ముఖ్యమైనవి. సరళ రేఖ మాదిరిగా సాగిపోతే పాధాన్యం ఉండదు. ఈసీజీ యంత్రంలో కూడా సరళ రేఖ కనిపించిందంటే మనం బతికి లేమని అర్థం. 

* అదృష్టంకోసం ఏవో వస్తువులను వదలటంపై నాకు నమ్మకం లేదు. అకుంటిత శ్రమ, సంసిద్ధతనే నేను నమ్ముతాను.

* నాకోసం కూడా నేను ఏమీ చేసుకోలేని స్థితిలో ఉన్నరోజున.. నా బ్యాగులు సర్దుకొని వెళ్లిపోతాను.

టాటాను వరించిన అవార్డులు

  1. హానరరీ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (2014) 
  2. ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా (2023)
  3. పద్మ విభూషణ్ (2008)
  4. పద్మ భూషణ్ (2000)
  5. మహారాష్ట్ర భూషణ్ (2006)
  6. మహారాష్ట్ర ఉద్యోగ రత్న (2023)
  7. అస్సాం వైభవ్ (2021)
  8. మెడల్ ఆఫ్ ది ఒరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే (2004)
  9. ఇంటర్నేషనల్ డిస్టింగ్విష్‌డ్ అచీవ్‌మెంట్ అవార్డ్ (బినయ్ బ్రిత్ ఇంటర్నేషనల్ -2005)
  10. రెస్పాన్సిబుల్ కాపిటలిజం అవార్డ్ (2006)
  11. కార్నీజీ మెడల్ ఆఫ్ ఫిలాంత్రోపీ (2007)
  12. హానరరీ సిటిజెన్ అవార్డ్ (సింగపూర్ ప్రభుత్వం -2008)
  13. ఇన్‌స్పైర్డ్ లీడర్‌షిప్ అవార్డు (పెర్ఫామెన్స్ థియేటర్-2008)
  14. లైఫ్‌టైం కంట్రిబ్యూషన్ అవార్డ్ ఇన్ ఇంజినీరింగ్ ఫర్ 2008
  15. గ్రాండ్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ (ఇటలీ -2009)
  16. హడ్రియన్ అవార్డ్ (వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్-2010)
  17. ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డ్ (బిజినెస్ ఫర్ పీస్ ఫౌండేషన్-2010)
  18. లెజెండ్ ఇన్ లీడర్‌షిప్ అవార్డ్ (యేల్ యూనివర్సిటీ-2010)
  19. శాయాజీ రత్న (బరోడా-2014)
  20. కమాండర్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ (ఫ్రాన్స్-2016)

* జీవితంలో విజయం సాధించటం అంటే నువ్వు అనుభవిస్తున్న స్థాయి కాదు. ఇతరులపై నువ్వు చూపే ప్రభావం.

* ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. కానీ, దానికి పట్టే తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగు మనిషిని ఇతరులెవరూ నాశనం చేయలేరు.. అతడి మస్తిష్కమే అతడిని నాశనం చేస్తుంది.

* నాయకత్వం అంటే ఒక పదవికి సంబంధించిన అధికారాలు తీసుకోవటం కాదు. నీ అధికారం కింద ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవటం.

* నువ్వు వేగంగా నడువాలనుకొంటే ఒంటరిగా వెళ్లు. కానీ, నువ్వు సుదూరం నడువాలనుకొంటే ఇతరులతో కలిసి వెళ్లు.

* నాయకుడు మరింత ముందుకు సాగటానికి సానుభూతి, దయాగుణం గొప్ప శక్తులుగా తోడ్పడుతాయి.