calender_icon.png 4 April, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొమ్మిది మంది ఎమ్మెల్సీలకు వీడ్కోలు

28-03-2025 01:50:00 AM

రేపటితో ముగియనున్న పదవీకాలం

సభ్యులను సత్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి):  శాసనమండలిలోని 9మంది సభ్యుల పదవీకాలం శనివారంతో ముగియనుంది. దీంతో మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పదవీకాలం ముగియనున్న ఎంఎస్ ప్రభాకర్, మహమూద్ అలీ, టీ జీవన్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, అలుగుబెల్లి నర్సిరెడ్డి,షేరి సుభాష్ రెడ్డి, కూర నరోత్తంరెడ్డి, సత్యవతి రాథోడ్, మీర్జా రియాజుల్ లను శాలువాలు, బొకేలు, మెమొంటోలతో సత్కరించారు.

ఈ సందర్భంగా సభ్యుల సేవలను మండలి చైర్మన్ కొనియాడారు. ఈ తొమ్మిది మందిలో ఎంఎస్ ప్రభాకర్ సీనియర్ సభ్యులు. ఈయన ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించడం ఇది మూడోసారి. ఆ తర్వాత మహమూద్ అలీకి ఇది రెండో పర్యాయం. మిగతా సభ్యులు తొలిసారిగా పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించారు. వీరి స్థానంలో ఇటీవల ఎన్నికైన మల్క కొమురయ్య, శ్రీపాల్‌రెడ్డి, సత్యం, అద్దంకి దయాకర్, అంజిరెడ్డి 29వ తేదీ తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్నారు.