calender_icon.png 16 November, 2024 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫెంటాస్టిక్ ఫజల్

15-06-2024 01:17:59 AM

ట్రినిడాడ్: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. గ్రూప్ భాగంగా శుక్రవారం జరిగిన పోరులో అఫ్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియాపై గెలుపొందింది. దీంతో ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్ తర్వాత సూపర్ బెర్త్ దక్కించుకున్న రెండో జట్టుగా అఫ్గాన్ నిలిచింది. ఫలితంగా ఐసీసీ టోర్నీల్లో నిలకడకు మారుపేరుగా నిలిచే న్యూజిలాండ్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ఇంటిబాట పట్టింది. సూపర్ స్థాయికి అర్హత సాధించడం అఫ్గాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇక సూపర్ దశ తొలి మ్యాచ్‌లో టీమిండియాతో అఫ్గాన్ తలపడనుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 19.5 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ కిప్లిన్ డోరిగా (27) టాప్ స్కోరర్ కాగా.. ఆ తర్వాత ఎక్స్‌ట్రాల (25)దే సింహభాగం. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫరూఖీ 3, నవీన్ రెండు వికెట్లు పడగొట్టారు. పపువా ప్లేయర్లలో నలుగురు రనౌట్ కావడం గమనార్హం. అనంతరం ఛేదనలో అఫ్గాన్ 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. గుల్బదీన్ నైబ్ (49 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు.

దటీజ్ అజయ్ జడేజా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతాలు చేస్తున్న అఫ్గానిస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న.. భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అందుకు గానూ పారితోషకం తీసుకోవడం లేదట! నిరుడు వన్డే ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన చేసిన అఫ్గాన్.. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్టును చిత్తుచేసి సూపర్ దశకు చేరింది. అఫ్గాన్ నిలకడైన ప్రదర్శన వెనక మెంటార్ జడేజా పాత్ర ఎంతో ఉంది. అయితే పలుమార్లు ఒత్తిడి తెచ్చినా.. జడేజా పారితోషకం తీసుకునేందుకు నిరాకరించాడని అఫ్గానిస్థాన్ బోర్డు అధికారి తెలిపారు. ‘చాలా సార్లు అతడికి నగదు ఇచ్చే ప్రయత్నం చేశాం. కానీ అందుకు జడేజా ఒప్పుకోలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో మీ విజయాలే నాకు రివార్డులు అని సున్నితంగా తిరస్కరించాడు’ అని అఫ్గాన్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ వెల్లడించాడు.