calender_icon.png 4 March, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబమే ముఖ్యం

29-01-2025 12:52:16 AM

వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై 78% మంది ఉద్యోగుల అభిప్రాయమిదే!

న్యూఢిల్లీ: వారానికి 72 గంటలు.. వారానికి 90 గంటలు అంటూ పని వేళలపై ఇటీవల పెద్ద ఎత్తునే చర్చ  నడిచింది. దీన్ని ఖండించేవాళ్లతో పాటు సమర్థించేవాళ్లూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో అసలు  ఉద్యోగులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఓ సర్వే సంస్థ.

ఇందులో 78  శాతం మంది భారతీయులు కుటుంబమే తమకు ప్రాధాన్యమని పేర్కొనడం గమనార్హం. దాని తర్వాతే  ఏదైనా అనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ మేరకు ప్రము ఖ జాబ్‌సైట్ ఇండీడ్ ‘ఫ్యూచర్ కెరీర్  రిజల్యూషన్ రిపోర్ట్’ను విడుదల చేసింది. 

సర్వే లో పాల్గొన్న భారతీయుల్లో ఐదుగురిలో నలుగురు  (78 శాతం) కుటుంబ బంధాల కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇండీడ్ తెలిపింది. 2025 కెరీర్‌లో  రాణించడం కంటే భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో గడపడానికే అధిక ప్రాధాన్యమిస్తామని పేర్కొ న్నారు.  తక్కువ పని ఒత్తిడి ఉండేలా చూసుకోవడంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా దృష్టి  పెట్టాలనుకుంటున్నట్లు ఉద్యోగులు తెలిపారు.

అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఉపాధి అవకాశాలు  విస్తరిస్తాయన్న ఆశాభావాన్ని ఇదే సర్వేలో పలువురు వ్యక్తంచేశారు. 2024 డిసెంబర్ నుంచి  2025 జనవరి మధ్య భారత్ సహా జపాన్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇండీడ్ ఈ సర్వే నిర్వహించింది.  ఇందులో భారత్ నుంచి 2507 మంది సర్వేలో పాల్గొన్నారు.

భారతీయ ఉద్యోగుల్లో పని, వ్యక్తిగత  జీవితానికి మధ్య సమతూకం కోరుకునే వారి సంఖ్య పెరుగుతోందని ఇండీడ్ మార్కెటింగ్ డైరెక్టర్  రాచెల్ టౌన్స్లీపేర్కొన్నారు. అంతేకాదు ఎక్కువ సంపాదించడం ముఖ్యమే అయినా జీవితంలో  ఎదగడమనేది నిచ్చెనమెట్లు కాదని చాలా మంది భావిస్తున్నారని చెప్పారు. భద్రత, పనికి సరైన  వేతనం, ఇతర ప్రయోజనాలు వంటివి కూడా చూస్తున్నారని తెలిపారు.