calender_icon.png 26 March, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలి 400 ఎకరాల భూమిపై తప్పుడు కథనాలు

26-03-2025 01:54:54 AM

  1. ఆ భూమిలో బఫెలో లేక్, పికాక్ లేక్ లేవు..
  2. వాస్తవాల వక్రీకరణ జరిగింది.. వాటిని ఖండిస్తున్నాం..
  3. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిపై మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయని, వాటిని ప్రభుత్వం ఖండిస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వాస్తవాలను వక్రీకరించి మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయని దుయ్యబట్టారు. టీజీఐఐసీ అభివృద్ధి చేస్తున్న ఆ 400 ఎకరాల భూమి పరిధిలో బఫెలో లేక్ లేదా పికాక్ లేక్‌లు వంటివి లేవని స్పష్టం చేశారు. సదరు భూమిలోని రాతి నిర్మాణాలతో పాటు పుట్టగొడుగు ఆకారపు అపురూపమైన రాయిని గ్రీన్ జోన్‌గా మారుస్తామని తేల్చిచెప్పారు.

ఈ మేరకు పర్యావరణ పరిరక్షణ ప్రణాళికను కూడా సిద్ధం చేశామని స్పష్టం చేశారు. టీజీఐఐసీ ఆ స్థలంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నదని తెలిపారు. త్వరలో టెండర్లను ఆహ్వానిస్తుందని వెల్లడించారు. “ ఆ భూమిని 2003లో కీడా సౌకర్యాల అభివృద్ధి పేరిట ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేటాయించింది.

ఐఎంజీ అకాడమీస్ ఆ ప్రాజెక్టును ప్రారంభించనే లేదు. దీంతో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించి భూకేటాయింపును రద్దు చేసింది. ఐఎంజీ అకాడమీస్ భూకేటాయింపు రద్దుపై హైకోర్టులో పిటిషన్ వేసింది. గతేడాది మార్చి 7న హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్థిస్తూ తీర్పునిచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ కంపెనీ తిరిగి సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

ఇదే ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను సైతం కొట్టివేసింది. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఆ 400 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ధ్రువీకరించారు. ఆ భూమికి అటవీ శాఖకు ఎలాంటి సంబంధం లేదు.

అది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఆ భూమిని టీజీఐఐసీకు కేటాయిస్తూ గతేడాది జూన్ 26న  రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది’ అని మంత్రి స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ విశ్వవిద్యాలయ (హెచ్‌సీయూ) పరిధిలో భూమి, అక్కడి నీటి వనరుల ఆక్రమణ జరిగిందని లేనిపోని ప్రచారం జరుగుతోందని, నిజానికి అవేమీ వాస్తవాలు కావని పేర్కొన్నారు.