01-04-2025 08:44:34 PM
హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములపై చర్చ జరుగుతోందని, వర్సిటీ భూములను ప్రభుత్వం గుంజుకున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) అన్నారు. 2004 వరకు ఈ 400 ఎకరాలు వర్సిటీ భూములతోనే ఉన్నాయని, 2004లో ఈ భూములను చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ(IMG) భారత్ కు ఇచ్చేసిందని తెలిపారు. ఈ భూముల బదలాయింపు పత్రాలు కూడా చూసుకోవచ్చని.. ప్రభుత్వంలో లోపాలు దొరకట్లేదని.. ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నారని మంత్రి భట్టి మండిపడ్డారు. ఈ 400 ఎకరాలు బిల్లీరావుకు చంద్రబాబు సర్కారు ఇచ్చేసిందని, చంద్రబాబు తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వం ఆ భూకేటాయింపును రద్దు చేసిందన్నారు.
2006లో వైఎస్ సర్కారు బిల్లీరావు సంస్థకు ఇచ్చినా భూకేటాయింపును రద్దు చేసిందని, వైఎస్ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ హైకోర్టుకు వెళ్లిందన్నారు. 2006 నుంచి ఈ 400 ఎకరాల భూముల అంశం కోర్టులోనే ఉందని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్(BRS Govt) ఈ భూముల అంశాన్ని గాలికొదిలేసిందన్నారు. బీఆర్ఎస్ ఈ భూములను గాలికి ఎందుకు వదిలిందో తర్వాత చెబుతానని అన్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి తమ చేతుల్లోకి తెచ్చుకోవచ్చని బీఆర్ఎస్ పెద్దలు భావించారని, రూ. వేల కోట్ల భూమి ప్రభుత్వానికే ఉండాలని ఈ ప్రభుత్వం కోర్టుల్లో కోట్లాడిందని ఆరోపించారు.
హైకోర్టు(High Court)లో కేసు గెలిచి ఈ 400 ఎకరాల భూమిని ప్రభుత్వపరం చేశామని, రూ. వేల కోట్ల భూమిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తాము కాపాడామని వివరించారు. 400 ఎకరాల భూమి ప్రభుత్వపరం అయ్యాక టీజీఐఐసీ(TGIIC)కి అప్పగించాయని, అంతర్జాతీయ సంస్థలను రప్పించి యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని తాము భావించామన్నారు. హైటెక్ సిటీ(Hi-Tech City), హైటెక్ సిటీ ఫేజ్-2, నాలెడ్జ్ సిటీ(Knowledge City) ద్వారానే ఉపాధి పెరిగిందని, యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా లక్ష్యమని మంత్రి భట్టి అన్నారు. అప్పట్లో ఈ భూములను గాలికొదిలిన వారు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ఎదగాలి.. సంపద సృష్టి జరగాలి.. ఉపాధి పెరగాలి.. అని అన్నారు. తాము పట్టించుకోకపోతే ఈ 400 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల పరమయ్యేదని, 400 ఎకరాలు సాధించడం కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) విజయం .. రాష్ట్ర విజయం అని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.