21-04-2025 01:17:51 AM
పేద ముస్లింలకు న్యాయం చేయడానికే వక్ఫ్ సవరణ చట్టం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్
మంచిర్యాల, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ సవరణపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. ఆదివారం బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వెరబెల్లితో కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డును ప్రక్షాళన చేయాలని, వక్ఫ్ ఆస్తులు పేద ముస్లింలకు దక్కాలనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకువస్తే దాని పై కాంగ్రెస్, ఎంఐఎంలు ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ స్వలాభం కోసం బిల్లు పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఇన్ని రోజులు వక్ఫ్ ఆస్తుల పేరుతో కొన్ని సంపన్న ముస్లిం పెద్దలు అవినీతికి పాల్పడి ఆస్తులను దోచుకున్నారన్నారు. మోదీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులు ముస్లింలలో పేదలకు, వెనుకబడిన ముస్లింలకు చెందాలనే ఉద్దేశంతో ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి ఆమోదం పొందేందుకు కృషి చేశారని తెలిపారు. ముస్లింలు ఎవరు కూడా వక్ఫ్ పై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, వక్ఫ్ ఆస్తులు అందరికీ అందుబాటులో ఉండేలా మోదీ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పట్టి వెంకట కృష్ణ, కొయ్యల ఎమాజీ, గాజుల ముఖేష్ గౌడ్, తాజ్ ఖాన్, ఎనగందుల కృష్ణ మూర్తి, అమిరిశెట్టి రాజు, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, మాసు రజిని, అక్కల రమేష్, రాకేష్ రెన్వ, బూర్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.