03-03-2025 01:04:37 AM
నాగర్‌కర్నూల్, మార్చి 2 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ తెలిసినప్పటికీ వారి మృతదేహాలను బయటకు తీసేందుకు నీటి ఊట, బురద అడ్డంకిగా మారాయి. దీంతో కార్మికుల కుటుంబ సభ్యులకు నిరీక్షణ తప్పడం లేదు.
ప్రతి నిమిషానికి సుమారు పదివేల లీటర్ల మేర నీటి ఊట వస్తుండటంతో టన్నెల్‌పై భాగం నుంచి మట్టి దిబ్బలు ఊడిపడుతున్నాయి. దీంతో టన్నెల్‌లో భారీగా బురద పేరుకుపోతోంది. వారం రోజులుగా పేరుకుపోయిన బురదకు సిమెంట్ కలవడంతో అదికాస్తా కాంక్రీట్‌గా మారింది. ఈ నేపథ్యంలో డ్రిల్లింగ్ చేస్తూ రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
టన్నెల్‌లో ఉబికి వస్తున్న నీటి ఊట వల్ల డ్రిల్లింగ్‌కు సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు నలుగురి ఆనవాళ్లను టీబీఎం మిషన్ కింద గుర్తించిన రెస్క్యూ టీం.. మిషన్ భారీ గ్యాస్ కట్టర్‌లతో కట్ చేసి, వారి మృతదేహాలను బయటకు తీసేందకు ప్రయత్నిస్తుంది.
అయితే లోకో ట్రైన్ సౌకర్యం కేవలం 12 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉండటంతో వేరు చేసిన మిషన్ భాగాలను బయటకు తీసుకురావడంతో ఇబ్బందులు ఎదురై, మృతదేహాలను బయటకు తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు.
అసలు నీటి ఊట ఎందుకు వస్తుంది?
ప్రమాదం జరిగిన 14వ కిలోమీటరు వద్ద సొరంగం పై భాగంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్‌లో గల తిర్మలాపూర్ సమీప ప్రాంతం లేదా మల్లెల తీర్థం నుంచి భూమి పొరల గుండా ఎస్‌ఎల్బీసీ వైపు పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వస్తున్నట్టు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జియోలాజికల్ అధికారులు సర్వే నిర్వహించారు.
కుర్తిపెంట, టేకులసర్వ ప్రదేశాల్లో నీటి పొరలు ఉన్నట్టు గర్తించారు. నల్లమల్ల అడవుల్లోని ఉసురువాగు, మల్లెవాగు, మల్లెల తీర్థం తదితర ప్రాంతాల నుంచి భూమి పొరలగుండా కృష్ణానది వైపు నీటి ప్రవాహం వస్తున్నట్టు అంచనా వేశారు. ఈ వాగుల వల్ల ఎస్‌ఎల్బీసీ సొరంగం వైపు పెద్ద మొత్తంలో నీటి ధారలు వస్తున్నట్టు భావిస్తున్న అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించడానికి సిద్ధమయ్యారు