calender_icon.png 30 April, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్ప శిల్పాలపై అసత్య వివరణ?

30-04-2025 12:00:00 AM

  1. రాళ్లను కరిగించి శిల్పాలు చేశారన్న గైడ్..
  2. ఖండించిన చరిత్రకారుల బృందం

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్పదేవాలయాన్ని సోమవారం మిస్ ఇండియా  నందినిగుప్తా సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్థానిక టూరిస్టు గైడ్లు రాళ్లను కరిగించి పోతపోసి మలిచిన రామప్పశిల్పాలని ఆమెకు వివరించడాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, కోకన్వీనర్లు బీవీ భద్రగిరీశ్, కట్టా శ్రీనివాస్ ఖండించారు.

రామప్ప శిల్పాలు ఉలితో చెక్కి మలిచినవేకానీ రాళ్లను కరిగించి, పోతపోసినవి కావని, అలాంటి అభూత కల్పనలు తెలంగాణ శిల్పుల కీర్తిని మసకబారుస్తాయని చెప్పారు. రామప్ప టూరిస్టు గైడ్లు వాస్తవబద్ధమైన శిల్పకళావైభవవాన్ని మాత్రమే వివరించాలని సూచించారు. ఈ చరిత్రబృందం అభిప్రాయంతో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, డీఎన్వీ ప్రసాద్ ఏకీభవించారు.

రాళ్లను కరిగించి శిల్పాలు చెక్కే సాంకేతికత ఈ కాలంలో కూడా లేదన్నారు. ఒకసారి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిలను ఎక్కువ ఉష్ణోగ్రతకు గురిచేస్తే అది ముక్కలు కావటం తప్ప ఏమీ జరగదని ప్రముఖ జియోలజిస్టు, చరిత్రబృందం సలహాదారుడు చకిలం వేణుగోపాల్‌రావు చెప్పారు.

పోతపోసిన శిల్పాలు అనలేదు: గైడ్

నందినీగుప్తాకు తాము పోతపోసిన శిల్పాలు అని చెప్పలేదని రామప్ప గైడ్లలో ఒకరైన విజయ్ వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ హరగోపాల్‌తో ఫోన్లో మాట్లాడి చెప్పానని తెలిపారు. రామప్ప శిల్పాలు రాళ్లను కరిగించి పోతపోసినవని చెప్పలేదని వివరించారు.