26-03-2025 08:40:12 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మాజీ కౌన్సిలర్ పొట్ల సురేష్ ను రాజకీయంగా అనగదొక్కేందుకే కొంతమంది అతనిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కన్నాల బస్తీకి చెందిన ఈర్ల అనుశ్రీ, పిట్టల మల్లక్క అలియాస్ మల్లేశ్వరి, అడ్డూరి స్వప్నలు అన్నారు. బుధవారం కన్నాల బస్తికి చెందిన మరి కొంతమందితో కలిసి బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గత 25 ఏళ్ల కిందట అప్పటి కౌన్సిలర్ జెల్ల శంకరయ్య నిరుపేదలమైన తమతో పాటు మరికొంతమందికి ఇంటి నిర్మాణం కోసం భూమిని కేటాయించారని వారు తెలిపారు. ఆ ప్రాంతంలో త్రాగునీరు, విద్యుత్ సదుపాయం లేకపోవడంతో తాము బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిపారు. తమకు కేటాయించిన భూమిలో అప్పట్లోనే బేసిమెంట్లు కూడా నిర్మించుకున్నామని చెప్పారు. తమకు కేటాయించిన భూమిలో స్థానికులైన పోచంపల్లి రమాదేవి, పోచంపల్లి అనసూర్యలు గత కొద్ది రోజుల కింద షెడ్డు నిర్మించుకున్నారని చెప్పారు.
తమ భూమిని దౌర్జన్యంగా కబ్జా చేస్తున్న విషయం తెలిసిన వెంటనే నాయకులు పొట్ల సురేష్ దానిని అడ్డుకోబోయే ప్రయత్నం చేశారని, గతంలో పలువురికి కేటాయించిన భూమిని ఎవరు ఆక్రమించవద్దని గట్టిగా మందలించారని తెలిపారు. భూమిని ఆక్రమించే ప్రయత్నాలను స్థానిక అధికారులకు తెలిపిన పొట్ల సురేష్ పై భూకబ్జాకు తెగబడిన వ్యక్తులు లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు. పేదవాళ్లమైన తమ భూమిని కబ్జా చేస్తుంటే అడ్డుకోవడమే పొట్ల సురేష్ చేసిన నేరమా అని ప్రశ్నించారు. తాను మాజీ నక్సలైట్ అంటూ పొట్ల సురేష్ బెదిరించారని చేస్తున్న ఆరోపణలను తాము పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
తాము కుటుంబ పరిస్థితుల రీత్యా మరో ప్రాంతంలో జీవిస్తున్నామని, బెల్లంపల్లిలోని కన్నాల బస్తీలో తమకు కేటాయించిన భూమిని ఎవరికి అమ్మలేదని స్పష్టం చేశారు. కన్నాల బస్తీలోని పార్కుకు మహిళలు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. కన్నాల బస్తీలో మద్యం, గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, మహిళలు కనీసం రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తలెత్తుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన భూమిని కబ్జా చేయవద్దని గట్టిగా మందలించినందుకు పొట్ల సురేష్ తమను నక్సలైట్ నంటూ బెదిరించారని ఆరోపణలు చేయడం ఎంత మాత్రం సరైనది కాదని అన్నారు. పుట్ల సురేష్ మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచిన కాలంలో తమ బస్తీలు అనేక సమస్యలు పరిష్కరించాలని చెప్పారు.
ఏనాడు బస్తీలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదని వారు తెలిపారు. నిరుపేదలమైన తమకు అండగా నిలిచి తమ భూమిని కాపాడే ప్రయత్నం చేసిన మాజీ కౌన్సిలర్ పొట్ల సురేష్ కు కన్నాల బస్తి ప్రజలంతా అండగా నిలబడతారని చెప్పారు. పొట్ల సురేష్ గతంలో నక్సలైట్ గా పనిచేసినా, కౌన్సిలర్ గా కొనసాగిన గుంట భూమి కూడా సంపాదించుకోలేదని వారు తెలిపారు. పొట్ల సురేష్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే తాము ఊరుకోమని హెచ్చరించారు. అధికారులు నిరుపేదలమైన తమకు అండగా నిలబడి తమ భూమిని తమకు కేటాయించేలా చూడాలని వేడుకున్నారు. ఈ సమావేశంలో భూమి హక్కుదారులు శంకరమ్మ, అడ్డూరి లింగయ్య, కొయ్యడ ఓదేలు, కొయ్యడ వెంకటేష్, కొయ్యడ శోభ, మోకనపల్లి సూరమ్మ, పిట్టల మల్లమ్మ, బొజ్జ రాజేశ్వరి, పొట్ల లలిత తదితరులు పాల్గొన్నారు.