calender_icon.png 27 September, 2024 | 3:23 AM

పడి లేచిన కెరటం.. అర్జున్

26-09-2024 12:00:00 AM

చెస్‌లో ఓరుగల్లు చిన్నోడి సత్తా

  1. అర్జున్ ఎత్తులకు ప్రత్యర్థులు చిత్తు
  2. 45వ చెస్ ఒలింపియాడ్‌లో ఓటమెరుగని గ్రాండ్ మాస్టర్

బుద్ధుగా ఉన్నామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. ఈ డైలాగ్ అర్జున్ ఇరిగేసికి సరిగ్గా సరిపోతుందేమో.. ప్రశాంతంగా కనిపించే అర్జున్ వేసే ఎత్తులకు ప్రత్యర్థులు చిత్తవడం ఖాయం. చదరంగంలో రారాజులా గర్జిస్తోన్న అర్జున్‌ది మన ఓరుగల్లే కావడం తెలంగాణ వారికి గర్వకారణం.

విజయక్రాంతి ఖేల్ విభాగం: 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత గ్రాండ్ మాస్టర్లు సత్తా చాటారు. పురుషులతో పాటు మహిళలు కూడా స్వర్ణం కైవసం చేసుకుని ఎన్నో ఏళ్ల భారత కలను సాకారం చేశారు. చెస్‌కు పుట్టిల్లు అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణం గెలవలేకపోయింది.

కానీ ఆ లోటును మన గ్రాండ్ మాస్టర్లు పూర్తి చేశారు. భారత్ స్వర్ణ కల సాకారం కావడంలో తెలంగాణకు చెందిన గ్రాండ్ మాస్టర్ అర్జున్‌ది కీలకపాత్ర. కొద్ది రోజుల క్రితం వరకు ఓటములతో సతమతమయిన అర్జున్ తాజాగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ పోటీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

చెస్ ఒలింపియాడ్‌లో పురుషుల జట్టు స్వర్ణం గెలవగా.. అర్జున్ తాను ఆడిన 11 మ్యాచ్‌ల్లో తొమ్మిది గెలిచి రెండింటిని డ్రాగా ముగించాడు. తద్వారా వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణం సాధించి అర్జున్ కొత్త చరిత్ర లిఖించాడు. అంతేకాదు ఫిడే రేటింగ్స్‌లో తన కెరీర్‌లో అత్యధిక పాయింట్లు (2797.2) సాధించిన అర్జున్ ప్రపంచ మూడో ర్యాంకర్‌గా నిలిచాడు. పీటీఐ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

గతేడాది ఎంతో కష్టంగా..

‘ప్రస్తుతం వరల్డ్ నంబర్ 3 ర్యాంకులో కొనసాగుతున్నా  కానీ కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ఒకప్పుడు 2500 రేటింగ్ పాయింట్లతో కొనసాగాను. ఇక 2023వ సంవత్సరంలో 2700 రేటింగ్ పాయింట్లకు చేరుకున్నా. ఫలితాలను గురించి నేను ఏనాడూ బాధపడలేదు. 2023లో జరిగిన క్యాండిడేట్ చెస్ టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమమ్యాను. ఆ సమయంలో ఎంతో నిరాశ చెందాను.

దీంతో 2023 ఎంతో కష్టంగా గడిచింది. ఆ తర్వాత ఫలితాల గురించి ఆలోచించడం మానేశా. అప్పటి నుంచి స్వేచ్ఛగా, మరింత దూకుడుగా ఆడగలిగా. ఏదో సాధించాలనే విషయాన్ని వదిలిపెట్టా. నీ బెస్ట్ ఇవ్వగలిగితే ఫలితాలు కూడా నమ్మశక్యం కాని విధంగా ఉంటాయని అప్పుడే అర్థమైంది. కానీ అది అంత సులభం కాదు.’అని చెప్పుకొచ్చాడు.

వరంగల్‌లో పుట్టి పెరిగి..

గ్రాండ్ మాస్టర్ అర్జున్‌ది ఉమ్మడి వరంగల్ జిల్లా. 2003లో పుట్టిన అర్జున్ హన్మ కొండలోని బీఎస్ చెస్ అకాడమీలో చదరంగంలో మెళుకువలు నేర్చుకున్నాడు. 2015లోనే కొరియాలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్స్‌లో రజతం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. 14 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన అర్జున్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ సీనియర్ జట్టులో కీలకసభ్యుడిగా మారాడు. 2022లో హాంగ్జౌలో జరిగిన ఆసియా గేమ్స్‌లో అర్జున్ టీం విభాగంలో రజతం నెగ్గాడు.

ప్రపంచ చాంపియనే లక్ష్యం

‘ఎప్పటికైనా ప్రపంచ చాంపియన్ కావాలనేదే నా లక్ష్యం. నేను ఏ టోర్నీలో ఆడినా సత్తా చాటాలని అనుకుంటూ ఉంటా. జట్టుతో నాకు మంచి అనుబంధం ఉంది. రాబోయే గ్లోబల్ చెస్ లీగ్ కొరకు ఆతృతగా ఎదురుచూస్తున్న. ఆ లీగ్ చెస్ ఐపీఎల్.’ అని అర్జున్ చెపుకొచ్చాడు.