calender_icon.png 20 November, 2024 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతనమవుతున్న పత్తి ధర

20-11-2024 12:00:00 AM

  1. పత్తి రైతు దిగాలు
  2. ధరలు పెరిగేలా చూడాలని ప్రభుత్వానికి వేడుకోలు

కామారెడ్డి, నవంబర్ 19 (విజయక్రాంతి): రోజు రోజుకు పతనమవుతున్న ధరతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పత్తి ధరను తగ్గించుకుండా పెంచేలా చర్యలు తీసుకోవాలని పత్తి రైతులు కొరుతున్నారు. చేతికి పంట రాకముందు పత్తి ధర క్వింటాలుకు రూ.7 వేలకు పైగా పలికిన ధర రోజు రోజుకు తగ్గుతుంది.

సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఆలస్యంగా ప్రారంభించడంతో పత్తి రైతులు ఎక్కువగా ప్రవేట్ పత్తి మిల్లుల్లో తక్కువ ధరకు అమ్ముకున్నారు. గత వారం రోజుల క్రితం ప్రభుత్వం మద్నూర్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌యార్డ్‌లో ఏర్పాటు చేసింది.

కొనుగోలు కేంద్రం ప్రారంభమైన రెండు రోజులకే కేంద్ర కాటాన్ ప్రతినిధులు కొనుగోలు బంద్‌కు రెండు రోజుల పాటు పిలుపునివ్వడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ప్రవేట్ ప్రభుత్వ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు బంద్ చేసిన అధికారులు మరో మూడు రోజులు సెలవులు ప్రకటించడంతో సోమవారం కొనుగోళ్లు మద్నూర్ సీసీఐ సెంటర్‌లో ప్రారంభ మైంది. దీంతో సోమవారం పత్తి ధర క్వింటాలుకు రూ.6,750 పలికింది.

మంగళవారం మరింత రేటు తగ్గి రూ.6,730 కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని పత్తి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మద్నూర్‌లో ఉన్న ప్రవేట్ జిన్నింగ్ మిల్లుల్లో సైతం ధరను తగ్గించి కొనుగోలు చేపడుతున్నారు. పత్తి రైతులకు పంట చేతికి రావడంతో వ్యాపారులు, ప్రభుత్వం ధరను తగ్గించడంతో తీవ్రంగా నష్టపోతున్నామని పత్తి రైతులు వాపోతున్నారు. 

ఒక వైపు దిగుబడి.. మరో వైపు ధర

ఒక వైపు వాతావారణ పరిస్థితులు అనుకూలించక పత్తి దిగుబడి తగ్గిన రైతులను  మరోవైపు తగ్గిన ధరలు కుంగ తీస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో పడిన వర్షాలను మంచి దిగుబడి  వస్తుందని ఆశ పడిన రైతులకు ఎడతెరపి లేకుండా పడిన ముసురుతో పత్తి పంటలు దెబ్బతిని నిరాశే మిగిల్చింది.

చేను ఎర్రపడి బెందడి రోగం రావడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. మూడు దశల్లో పత్తి తీయాల్సి ఉండగా 1, 2 రెండు సార్లకే చేన్లు లూటీ అవుతున్నాయి. జనవరి వరకు పత్తితో కల కల లాడాల్సిన చేన్లు నవంబర్‌లోనే బోసిపోతున్నాయి. మరో వైపు పత్తి రైతులకు రోజు రోజుకు ధరలు తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు.

దక్కని మద్దతు ధర

సాధారణంగా మార్కెట్‌లో పంట ఉత్పత్తి తక్కువగా ఉంటే పంటకు డిమాండ్ ఉంటుం ది. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పత్తి దిగుబడులు తక్కువగా ఉన్నా మార్కెట్‌లో ధరలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కల్పించిన రూ.7,521 మద్దతు ధర కూడా దక్కడం లేదు.

నాణ్యత లేమి, తేమశాతం అనే కొర్రీలతో క్వింటాలుకు రూ.6,500 నుంచి రూ.7 వేల లోపే ధర చెల్లిస్తున్నారు. ప్రభుత్వం సీసీఐని రంగంలోకి దించినప్పటికీ కూడా రైతులకు ప్రయోజనం కలగడం లేదు. దీంతో గ్రామాల్లో దళారులు చెప్పిన ధరకే పత్తిని విక్రయిస్తూ నష్టపోతున్నారు. 

కౌలు రైతు కుదేలు

పత్తి సాగుతో రైతుల పరిస్థితి పూర్తిగా దయనీయంగా మారింది. భూమి ఉన్న రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు నష్టపోగా కౌలు రైతులు రెట్టింపు నష్టపోతున్నారు. ఎకరాకు రూ.45 వేల వరకు పెట్టుబడి పెట్టడంతో భూ యజమానికి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు కౌలు చెల్లించారు. దీంతో ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టాల్లో పూడుకపోయారు.

పెట్టుబడి కూడా కష్టమే

ఈసారి పత్తిలో పెట్టుబడి రావడమే కష్టంగా మారింది. నేను రెండు, మూడేళ్ల నుంచి భూమిని కౌలుకు తీసుకుని పత్తిని సాగు చేస్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురియక తీవ్రంగా నష్టపోయాను. నాకున్న రెండు ఎకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని ఎకరాకు రూ.16 వేల చొప్పున చెల్లిస్తూ కౌలు చేస్తున్నాను.

ఆరంభంలోనే పత్తి మంచిగానే మొలకెత్తి మొక్కలు ఎదిగిన దసరా తరువాత, పూత, కాత దశలో వర్షం లేకుండా పోయింది. దీంతో పోడి వాతావారణంతో ఎర్రబెందడి రోగం వచ్చి మొక్కలను ఉన్న పూత రాతిపోయింది. మొత్తంగా కౌలు డబ్బులతో పాటు పెట్టుబడి కూడా నష్టపోయాను.

 ధరమ్‌సింగ్, గాంధారి, కౌలు రైతు 

కాత లేదు.. దిగుబడి లేదు

నేను రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తిపంటను సాగు చేసిన. ఈసారి పత్తి విత్తనాల రేటు, ఎరువుల రేట్లు పెరిగినా వెనుకాడకుండా నాణ్యమైన వాటిని తీసుకొచ్చి వేసిన. వానలు పడటంతో పంట ఆశించిన స్థాయిలో రాలేదు. 10 క్వింటాళ్ల పత్తి కూడా రాలేదు. మార్కెట్‌లో మద్దతు ధర లేకపోవడంతో రూ.30  వేల వరకు నష్టపోయాను. 

 బాల్‌రెడ్డి, రైతు, అడ్లూర్ ఎల్లారెడ్డి