calender_icon.png 18 November, 2024 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాపారులను బెదిరిస్తున్న నకిలీ నక్సల్స్

18-11-2024 03:14:41 AM

ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

3 పిస్టళ్లు, 17 బుల్లెట్స్ స్వాధీనం 

ఖమ్మం, నవంబర్ 17 (విజయక్రాంతి): నక్సల్స్‌తో పేరుతో వ్యాపారులను బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరిని ఖమ్మం పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఖమ్మం సీపీ సునీల్‌దత్ ఆదివారం వివరాలు వెల్లడించారు.

ఖమ్మం కస్బాబజార్‌కు చెందిన మహ్మద్ అఫ్సర్, ఖానాపురంలో ఉంటున్న బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన గుండమల్ల వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, నష్టపోయి, అప్పులపాలయ్యారు. అప్పులు తీర్చేందుకు డబ్బులు సంపాదించేందుకు 11 నెలల క్రితం ఎండి రియాజ్ అనే వ్యక్తి సహకారంతో బీహార్ నుంచి మూడు పిస్టళ్లు, 17 బుల్లెట్లను తెప్పించారు.

వాటిని ఉపయోగించి ముదిగొండ ఏరియాలోని గ్రానైట్ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆదివారం వాహనాలపై వెళ్తూ ఖమ్మం త్రీ టౌన్ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులపై మరిపెడ, కేసముద్రం పోలీస్‌స్టేషన్లలో దోపిడీ కేసులు నమోదయ్యాయని సపీ సునీల్‌దత్ తెలిపారు. వారికి ఆయుధాలు సేకరించి పెట్టిన రియాజ్ పరారీలో ఉన్నాడని చెప్పారు.

ఆఫ్సర్‌పై ముడు కేసులు, గుండమల్ల వెంకటేశ్వర్లుపై మూడు కేసులు మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదై ఉన్నాయని సీపీ తెలిపారు. వారి నుంచి మూడు పిస్టళ్లు, నాలుగు మాగ్జిన్లు, 17 బుల్లెట్లను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.