calender_icon.png 19 April, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెబ్బేరు మున్సిపాలిటీలో నకిలీ లైసెన్సుల బాగోతం

17-04-2025 12:00:00 AM

  1. గుర్తించిన బ్యాంకు అధికారులు
  2. రూ 2300 తీసుకుని నకిలీ లైసెన్స్ జారీ
  3. ఏమి చేయలేమని చేతులెత్తేసిన కమీషనర్

పెబ్బేరు ఎప్రిల్ 16: అసలే అరకొరకగా సాగుతున్న వ్యాపారాలు, ఏదోలా నెగ్గుకురావాలని తలచిన ఓ యువకుడు బ్యాంకు లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. లోను రద్దు చేయటమే కాకుండా మున్సిపాలిటీ లైసెన్సు తప్పుడు ధృవీకరణ ఇచ్చారని కేసు నమోదు చేస్తామని బ్యాంకు అధికారులు హెచ్చరించడం తో లబో దిబో మనటం ఆ యువకుని వంతైన ఘటన పెబ్బేరు మున్సిపాలిటీ లో చోటు చేసుకుంది. 

రాష్ట్రంలోనే అత్యధికంగా టాక్స్ వసూలు చేసి 7వ స్థానంలో ఉన్న పెబ్బేరు మున్సిపాలిటీ, రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకున్న కమీషనర్ అశోక్ రెడ్డి తన పరిధిలో నఖిలీ లైసెన్సుల భాగోతం వెలుగులోకి వచ్చినప్పటికీ కిమ్మనకుండటం పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణానికి చెందిన దాసరి పెద్ద రాముడు సంత బజారు లో సారిక ప్లాస్టిక్ సామాను వ్యాపారం నిర్వహిస్తున్నారు.

2021 లో మున్సిపాలిటీ లో ట్రేడింగ్ లైసెన్సు తీసుకున్నారు. తర్వాత కాలంలో వ్యాపారం సరిగ్గా నడవకపోవటంతో లైసెన్సు రద్దు చేయాలని కోరుతూ మున్సిపాలిటీ అధికారులను అభ్యర్థించాడు. జనవరి 2024 లో మున్సిపాలిటీ ఉద్యోగి 6వేల రూపాయలు తీసుకుని లైసెన్సు ను రద్దు చేశానని తెలిపారు. అనంతరం గత నెలలో బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేస్తామని చెప్పారు.

తిరిగి పాత వ్యాపారం కొనసాగిస్తామని ఆశించారు. బ్యాంకు అధికారులను సంప్రదించగా మిగతా పత్రాలతో పాటు మున్సిపాలిటీ ట్రేడింగ్ లైసెన్సు కావాలని కోరారు. అదేక్రమంలో మున్సిపాలిటీ లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ మాసూమ్, గంగన్న లను కలిసాడు. పాతలైసెన్స్ పైనే తీసి ఇస్తామని నమ్మబలికారని బాధితుడు తెలిపాడు. లైసెన్సు కోసం 2300 అవుతుంది అని తెలిపారు.

మేము ఆన్ లైన్ లో కడుతాము మాకు ఫోన్ పే చేయమని, మాసూమ్ బంధువు అయిన జుబేర్ బిన్ అస్లామ్ నెంబర్ కు ఫోన్ పే చేయించారు. తర్వాత ట్రేడింగ్ లైసెన్సు కాపీని ఇచ్చారు. అదే కాపీని బ్యాంకు లో బాధితుడు పొందుపర్చాడు. తీరా బ్యాంకు అధికారులు క్యూఆర్ స్కాన్ చేయగా స్తనికంగా ఉన్న ఓ టైలరింగ్ షాపు కు చెందిన కొండూరు పద్మ దిగా గుర్తించారు.

పేర్లు వ్యాపారం దాసరి పెద్ద రాముడు పై ఉండగా, ఆన్ లైన్ లో పద్మ పేరుతో ఉండటం తో బాంక్ అధికారులు ఛీటింగ్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇట్టి విషయం పై బాధితుడు గురువారం మున్సిపాలిటీ కమీషనర్ అశోక్ రెడ్డి ని కలిసి వివరించారు. అది ప్రింట్ మిస్టేక్ అయిఉంటుందని తేలికగా తీసిపారేసారు.

నా పరిస్థితి ఎంటని కమీషనర్ ను బాధితుడు నిలదీయగా ఇటువంటి విషయాలు సాధారణంగా జరుగుతుంటాయి అని, కావాలంటే కొత్త లైసెన్సు తీసుకోమని చెప్పాడని బాధితుడు వాపోతున్నారు. మున్సిపాలిటీ లో ఇంటి టాక్స్ లో మెజర్మెంట్ లలో గతంలో మనుషులను చూసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా టాక్స్ లు వేశారని, ఓ ఇరవై మంది గతంలో కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేశారు.

ఇంతకూ తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చిన మున్సిపాలిటీ అధికారులపై చర్యలు తీసుకోవా లా..? అని లేక అధికారుల అత్యాశ కు బలైన బాధితుడిపైనా... అనేది అనంతకోటి ప్రశ్న గా మిగిలింది.

డబ్బులు తీసుకుని నకిలీ లైసెన్స్ ఇచ్చారు

నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు నఖిలీ లైసెన్సు అంటగట్టారు. అటు బ్యాంక్ అధికారులచే మున్సిపాలిటీ అధికారులు చేసిన తప్పుడు పనికి నేను అవమాన పడాల్సి వచ్చింది. కమీషనర్ కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. నఖిలీ లైసెన్సుల భాగోతం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతాను. నాకు న్యాయం చేసే దాకా వెనక్కి తగ్గేది లేదు.

దాసరి పెద్ద రాముడు

సారికా ప్లాస్టిక్ యజమాని వ్యాపారి,

పెబ్బేరు 

 పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం ...

ఈ రోజే నా దృష్టికి వచ్చింది. పూర్తిగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాము. బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాను.

 అశోక్ రెడ్డి, మున్సిపాలిటీ 

కమిషనర్, పెబ్బేరు