calender_icon.png 31 January, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సచివాలయంలో నకిలీ ఉద్యోగి

31-01-2025 01:17:08 AM

  1. ఫేక్ ఐడీ కార్డుతో రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్‌గా చలామణి
  2. చాకచక్యంగా పట్టుకున్న ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ 
  3. నిందితుడు ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్‌రావు
  4. అతడికి సహకరించిన మైనార్టీ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ డ్రైవర్ రవి
  5. పోలీసుల అదపులో ఇద్దరు.. కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్, జనవరి 30 (విజయ క్రాంతి): రాష్ట్ర సచివాలయంలో నకిలీ ఉద్యో గి వ్యవహారం కలకలం రేపింది. రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్‌గా ఫేక్ ఐడీ కార్డుతో సెక్రటేరియట్ ఉద్యోగిగా చలామణి అవుతున్న అతడిని ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్‌ఐ యూసఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పట్టుకున్నారు.

నిందితుడిని ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్‌రావుగా గుర్తించారు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండటంతో సెక్రటేరియట్ సీఎస్‌వో దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘాపెట్టిన ఇంటెలిజెన్స్ సిబ్బంది.. పూర్తి ఆధారా లతో చాకచక్యంగా భాస్కర్‌రావును పట్టుకున్నారు. భాస్కర్ రావు ఫేక్ ఐడీ కార్డును మైనార్టీ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాం త్ డ్రైవర్ రవి  తయారుచేసినట్లు ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు.

నకిలీ ఉద్యో గి వ్యవహారం మంగళవారం బయటపడగా.. గురువారం వెలుగులోకి వచ్చింది. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిఘా పెట్టి తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో భాస్కర్‌రావు బాగోతం బయటపడింది.

సైఫాబాద్ పోలీసుల అదుపులో ఇద్దరు

ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి భాస్కర్ రావు, డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ1 భాస్కర్‌రావు, ఏ2గా రవిని చేర్చారు. ఈ ఇద్దరు ఇప్పటివరకు ఏమైనా అక్రమాలు చేశారా? ఫేక్ ఐడీని చూపించి ఆర్థికంగా మోసాలకు పాల్పడ్డారా? వీరిని ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? సెక్రటేరియట్‌లో వీరి వెనుక ఎవరై నా ఉన్నారా? బాధితులు ఎవరైనా ఉన్నా రా? ఇలా పలు కోణాల్లో విచారిస్తున్నారు.

మంత్రులు పేర్లు చెప్పి దందా?

భాస్కర్‌రావు, రవి ఇద్దరు సెక్రటేరియట్‌లో కీలక మంత్రుల పేర్లు చెప్పి దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులతో పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి వద్ద భారీగా నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు వారిని ఈకోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫేక్ ఐడీలపై ముందే సమాచారంతో నిఘా

సచివాలయానికి కొంతకాలంగా విజిటర్స్ రాక పెరిగింది. సచివాలయంలో వివిధ రకాల పనుల నిమిత్తం వచ్చేవారు పాస్‌లు తీసుకొని లోపలికి వెళ్తారు. ఈ మధ్య కాలంలో కొందరు పాస్‌లు తీసుకోకుండా ఫేక్ ఐడీ కార్డులతో సచివాల యంలోకి వెళ్తున్న విషయం సెక్రటేరియట్ సీఎస్‌వో దేవిదాస్ దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే ఆయన ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్‌ను అలర్ట్ చేశారు.

నకిలీ ఐడీ కార్డులపై నిఘా పెట్టారు. సీఎం ప్రెస్‌మీట్ నిర్వహించిన మంగళవారం ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా మరింత పటిష్ఠం చేశారు. ఈ క్రమంలో ఆఫీసులోకి వెళ్లకుండా బయట అనుమానాస్పదంగా తిరుగుతున్న భాస్కర్‌రావును గుర్తించిన ఇంటెలిజెన్స్ సిబ్బంది.. అతడు ఫేక్ ఐడీతో లోపకి వచ్చినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.