calender_icon.png 11 March, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ డీఎస్పీ అరెస్టు

11-03-2025 12:35:34 AM

రూ.18 లక్షలు స్వాధీనం

అమాయక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన ఘనుడు

సూర్యాపేట, మార్చి 10 : తానొక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారినని చెప్పుకుంటూ అమాయక నిరుద్యోగుల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వ్యక్తిని సోమవారం పట్టణంలోని అరవై ఫీట్ల రోడ్డులో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా సూర్యాపేట టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ నరసింహ ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం లో వెల్లడించారు.

డిఎస్పీనని చెప్పుకుంటూ  సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మట్టపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాస్ రావు  అమాయక నిరుద్యోగులను ఆటో డ్రైవర్ల ద్వారా, హెయిర్ కట్ దుకాణాల వద్ద పరిచయం చేసుకుని పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లు వంటి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం కల్పిస్తానని, ఉన్నతాధికారులు తనకు తెలుసునని మాయమాటలు చెప్పి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని తెలిపారు.

సులభంగా డబ్బు సంపాదించి, వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డాడని చెప్పారు.  కోదాడ చెందిన ఓ మహిళకు పోలీస్ శాఖలో ఎస్సుగా ఉద్యోగం ఇప్పిస్తానని, ఆమె నుంచి రూ. 36 లక్షలు వసూలు చేశాడని, మార్టూరు కు చెందిన వ్యక్తికి కానిస్టేబుల్ పోస్టింగ్ ఇప్పిస్తానని అతని వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడని, అలాగే గురజాలకు చెందిన వ్యక్తికి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇప్పిస్తానని అతని వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడని తెలిపారు.

ఇదిలా ఉంటే ఇతని మటంపల్లి, రాజమండ్రి టూ టౌన్, నర్సరావుపేట, త్రిపు రాంతకం, మెడికొండుర్ లలో ఆరు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కేసు విషయమై శిక్ష అనుభవించి 2022లో విడుదల అయ్యాడని అన్నారు. అంతేకాకుండా తాను పోలీస్ నని నమ్మించేందుకు ఆ శాఖకు సంబంధించిన అన్ని వస్తువులను తన వద్ద ఉంచుకున్నాడని వివరించారు. ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా కోర్టులో అన్ని వివరాలను వివరించనున్నామన్నారు. నిందితుడి నుంచి రూ. 18 లక్షలు, అద్దె తీసుకున్న మహేంద్ర థార్ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సూర్యాపేట టౌన్ సిఐ రాఘవులు, ఎస్సులు సైదులు, ఆంజనేయులు, సిబ్బందిని అభినందించారు.