calender_icon.png 10 January, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ వైద్యుడి అరెస్ట్

10-01-2025 01:03:37 AM

కామారెడ్డి, జనవరి 9 (విజయక్రాంతి): తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిని గుర్తించి కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి మీడియకు వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ముల్కల రవీందర్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఆర్‌ఎంపీల వద్ద ప్రథమ చికిత్స నేర్చుకున్నాడు.

ఆధార్‌కార్డులో తన పేరును రవీందర్‌రెడ్డిగా ఫొటోషాప్‌లో మార్చుకున్నాడు. ఫేక్ సర్టిఫికెట్ చూపించి ఖానాపూర్‌లోని షణ్ముఖ ఆసుపత్రి, లింగంపేట భీమరాజు ఆసుపత్రిలో ఎంబీబీఎస్, ఎండీ, జనరల్ మెడిసిన్, పిల్లల వైద్యుడిగా కొనసాగాడు. ఖానాపూర్‌లోని షణ్ముఖ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిగా పనిచేయడానికి ఈ నెల 6న అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు తీసుకున్నాడు.

అయితే రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి అసలు వైద్యుడే కాదని తెలంగాణ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు రావడంతో రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద ఫేక్ ఆధార్‌కార్డు, సర్టిఫికెట్లు, ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో కామారెడ్డి పట్టణ, రూరల్ సీఐలు చంద్రశేఖర్‌రెడ్డి, రామన్, కామారెడ్డి సీసీఎస్ సీఐ శ్రీనివాస్, కామారెడ్డి, దేవునిపల్లి ఎస్సైలు శ్రీరామ్, రాజు  పాల్గొన్నారు.