22-04-2025 01:43:48 AM
500 రూపాయల నోట్లపై జాగ్రత్త వహించాలన్న ఆర్బీఐ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: మీ దగ్గర 500 రూపాయల నోటు ఉందా? అయితే వెంటనే ఆ నోటు ఒకసారి చెక్ చేసుకోండి. అవి నిజమైన నోట్లా.. నకిలీవా అనేవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తాజాగా 500 రూపాయల నోట్లపై కేంద్ర హోంశాఖ కీలక సూచనలు జారీ చేసింది. నకిలీ నోట్లపై ఎన్‌ఐఏ, డీఆర్‌ఐ, సీబీఐ, సెబీ సహా అనేక శాఖలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది.
నకిలీ నోట్లకు ఒరిజినల్ నోట్లకు తేడా అస్సలు గుర్తించలేకుండా ఉన్నాయని చెప్పింది. చిన్న చిన్న స్పెలింగ్ తప్పిదాలతో రూ. 500 నకిలీ నోట్లు పెద్ద మొత్తంలో చెలామణి అయ్యే ప్రమాదం ఉందని చెప్పింది. ఇప్పటికే అలాంటి 500 నోట్లు సర్కులేషన్‌లో ఉన్నాయని, జాగ్రత్త వ్యవహరించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. మరోవైపు నకిలీ 500 రూపాయల నోటును గుర్తించడం ఎలానో కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రిజర్వ్ (RESERVE) అనే చోట E అక్షరం బదులు A ముద్రించి ఉంటుందని వెల్లడించింది. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప 500 రూపాయల నోటుపై తప్పును అస్సలు గమనించలేరని తెలిపింది. ఈ నకిలీ నోట్ల గురించి ఇప్పటికే అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేసినట్టు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. నకిలీ కరెన్సీని అంగీకరించకుండా ఉండటానికి లావాదేవీల సమయంలో నోట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రత్యేక సూచనలు చేసింది.