calender_icon.png 14 December, 2024 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో నకిలీ నోట్ల దందా

14-12-2024 12:00:00 AM

  1. నాలుగు రోజుల క్రితం రూ.50 లక్షల పట్టివేత
  2. పోలీసుల అదుపులో నిందితులు!
  3. గురువారం రాత్రి మరో నలుగురి అరెస్టు
  4. బిచ్కుందలో నోట్ల తయారీ?
  5. దందా వెనుక ప్రజాప్రతినిధుల ప్రమేయం?

కామారెడ్డి, డిసెంబర్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్ల దందా ఆలస్యంగా వెలుగు చూసింది. నాలు గు రోజుల క్రితం బిచ్కుంద నుంచి బాన్సువాడ వైపు కారులో తరలిస్తున్న రూ.50 లక్షల నకిలీ నోట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు పట్టుకున్నట్టు తెలుస్తున్నది.

నకిలీ నోట్ల తయారీ ముఠాను నాలుగు రోజుల క్రితమే అదుపులోకి తీసుకుని వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది. టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్న ముఠాలోని ప్రధాన నిందితుడి ని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడుతుండటంతో మరికొంతమంది పేర్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

దీంతో గురువారం రాత్రి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. బిచ్కుంద మండల కేంద్రంలో నకిలీ నోట్ల తయారీ ముఠా కార్యకలపాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటక, మహారాష్ట్రలకు సమీపంలో బిచ్కుంద, జుక్కల్, మద్నూర్ మండలాలు ఉండటంతో బిచ్కుందను నకిలీ నోట్ల తయారీకి కేంద్రం గా మార్చుకున్నట్లు తెలుస్తుంది.

నకిలీ నోట్ల ముఠాతో ప్రమేయం ఉన్న వారిని రాత్రికి రాత్రే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టు ప్రచారం సాగుతున్నది. ఎవరిని పోలీసులు ఎప్పుడు తీసుకెళ్తారో అనే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జుక్కల్, బిచ్కుంద, బాన్సువాడ మండలాలకు చెంది న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని నకిలీ నోట్ల వ్యహరంపై ఆరా తీస్తున్నారు. ముఠా సభ్యుల్లో కొందరు ఇతర రాష్ట్రలకు వెళ్లినట్లు సమాచారం. 

ఐదు రోజులుగా విచారణ 

నకిలీనోట్లు తయారు చేసేందుకు మిషనరీని ఏర్పాటు చేసుకుని గత కొంత కాలంగా నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్నట్లు విచారణలో పోలీసులు తెలుసుకున్నట్టు సమాచారం. ఆలస్యమైనా కూడా పూర్తిగా లోతుగా విచారణ చేపట్టి నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేసే అవకాశాలు ఉన్నాయి. గత ఐదు రోజులుగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించిన మిషన్‌తో పాటు ముఠాలో ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. కేవలం కామారెడ్డి జిల్లా వరకే నకిలీ నోట్లను చెలమణి జరిగిందా లేక ఇతర రాష్ట్రాలకు కూడా చెలామణి చేశారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నకిలీ నోట్ల తయారీ ముఠాకు సూత్రాదారులు ఎవరు.. పాత్రదారుల ఎవరు అనే కోణంలో విచారిస్తున్నారు.

బిచ్కుంద ప్రాంతానికి చెందిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా జుక్కల్, బాన్సువాడ ప్రాంతాలకు చెందిన వారి వివరాలను వెల్లడించినట్లు తెలుస్తుంది. దీంతోనే గురువారం రాత్రి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. 

ఎన్నికల ముందు నుంచే.. 

పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో జరిగిన ఎన్నికలకు ముందు నుంచే నకిలీ నోట్లను తయారు చేసి చెలామణి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి వెనుక ప్రముఖులు ఉండి దందాను కొనసాగించారనే ఆరోపణలు లేకపోలేదు.

పోలీసులు నకిలీ నోట్ల ముఠా నుంచి పూర్తి సమాచారం వచ్చేవరకు నకిలీనోట్ల ముఠా గుట్టు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచే అవకాశాలు ఉన్నాయి. ఈ నకిలీనోట్ల తయారీ ముఠా ఎప్పటి నుంచి నకిలీనోట్లను తయారు చేస్తున్నారు ఎక్కడెక్కడ చెలామణి చేశారు. ఎవరెవరి అండ ఉంది ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందా అనేకోణంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.

స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నకిలీ నోట్ల ముఠాను కామారెడ్డి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకెళ్లి విచారిస్తున్నారు. ఈ వ్యవహరంపై పోలీస్ ఉన్నతాధికారులను వివరణ కోరగా తమకేమి సమాచారం లేదని తెలుపడం గమనార్హం.