calender_icon.png 4 March, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లీడిలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

03-03-2025 06:39:38 PM

పట్టుబడ్డ విత్తనాల విలువ రూ.6 లక్షల 85 వేలు..

ఐదుగురు వ్యక్తుల అరెస్ట్, బైక్ స్వాదీనం..

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లీడి క్రాస్ రోడ్ వద్ద సోమవారం 2.74 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుబడ్డ విత్తనాల విలువ రూ 6 లక్షల 85 వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. నకిలీ విత్తనాల దందాకు పాల్పడుతున్న 5 గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక పల్సర్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ భీమిని పోలీస్ స్టేషన్ లో విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం పక్కా సమాచారం మేరకు మల్లీడి క్రాస్ రోడ్ వద్ద ఎస్సై విజయ్ కుమార్, అగ్రికల్చర్ అధికారులు, పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా టీఎస్ 20 బీ2977 నెంబర్ గల పల్సర్ బైక్ పై రెండు మూటలు పెట్టుకొని వస్తుండగా వారిని ఆపే క్రమంలో ఒక వ్యక్తి పారిపోయాడన్నారు. 

వారి మూటలను తనిఖీ చేయగా అందులో నిషేధిత పత్తి విత్తనాలు తీసుకుని వెళుతున్నట్లు వెల్లడైందన్నారు. వారిని ఎక్కడి నుండి వస్తున్నారని విచారించగా పురుషోత్తం, గుంటూరుకు చెందిన సురేష్ కలిసి దహేగాం మండలం హత్తినికి చెందిన రాజన్న ఇంటి వద్ద గత కొన్ని రోజుల క్రితం 3 క్వింటాళ్ల పత్తి విత్తనాలు దాచినట్లు చెప్పారన్నారు. అందులో నుండి 50 కిలోలు తమ బావ పోషం, అతని స్నేహితుడు కృష్ణ వడాల గ్రామంలోని కొంతమందికి అమ్మేందుకు హత్తిని నుండి పల్సర్ బైక్ పై తీసుకొని వస్తుండగా మల్లిడి క్రాస్ వద్ద పట్టుకున్నట్లు ఏసిపి రవికుమార్ చెప్పారు.

తమతో వస్తే మిగతా పత్తి విత్తనాలు చూపిస్తామని చెప్పడంతో పంచులతో పాటు హత్తిని గ్రామానికి వెళ్లి రాజన్న ఇంట్లో నిల్వ ఉంచిన 227 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేసినట్లు ఏసిపి రవికుమార్ చెప్పారు. నకిలీ పత్తి విత్తనాల దంధా నడుపుతున్న పురుషోత్తం (గంగాపూర్, చింతల మానేపల్లి మండలం, 47 కిలోల పత్తి విత్తనాలు), పోశం (అంకోడ, చింతల మునపల్లి, పల్సర్ బైక్), రాజన్న (హత్తిని,227 పత్తి విత్తనాలు), కృష్ణ (చింతల మానేపల్లి), సురేష్ (గుంటూరు, ఆంధ్రప్రదేశ్) లను అరెస్టు చేసినట్లు చెప్పారు. పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాల విలువ రూ 6 లక్షల 85000 ఉంటుందని ఆయన తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మినా, కొనుగోలు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏసిపి. రవికుమార్ హెచ్చరించారు.