calender_icon.png 26 October, 2024 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ బిల్లులకు ఫేక్ చెక్కులు!

26-10-2024 02:08:37 AM

  1. సెంట్రల్ సర్కిల్ పరిధిలో రెండేళ్లలో 7,532 చెక్కులు బౌన్స్ 
  2. విలువ రూ.4.49 కోట్లు 
  3. విద్యుత్ శాఖలో కుంభకోణం 
  4. ఏళ్లు గడుస్తున్నా చర్యలు శూన్యం

వంగూరి గోపాలరావు :

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25(విజయక్రాంతి): దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్)లో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విద్యుత్ ఉద్యోగులు ప్రతినెలా వసూలు చేసే రెవెన్యూ టార్గెట్ ప్రక్రియలో పలువురు వినియోగదారుల బిల్లులకు సదరు ఉద్యోగులే చెక్కులను జమచేసి టార్గెట్ పూర్తయినట్లు చూపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఎస్‌పీడీ సీఎల్ అకౌంట్‌లో జమ అయిన చెక్కుల తాలుకా అకౌంట్‌లో డబ్బులు నిల్వ లేకపోవడంతో ఆ చెక్కులన్నీ బౌన్స్ అవుతున్నాయి. ఏండ్లుగా చెక్కులు బౌన్స్ అవుతున్నా.. ఈ చెక్కులకు ఒక్క రూపాయి కూడా ఎల్‌పీసీ (లేట్ పేమెంట్ ఛార్జీ)ని డిపార్ట్‌మెంట్ విధించడం లేదు.

దీంతో ఎస్‌పీడీసీఎల్‌లో అసలు చెక్కులెందుకు బౌన్స్ అవుతున్నాయి, క్లియర్ కానీ చెక్కులపై ఫైన్ విధించగాపోగా.. తదుపరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. బౌన్స్ అవుతున్న చెక్కుల మాటున అసలేం జరుగుతుందనే అంశం టీజీఎస్‌పీడీసీఎల్‌లో చర్చనీయాంశంగా మారింది. 

రెండేళ్లలో 7,532 చెక్కులు బౌన్స్ 

హైదరాబాద్ మెట్రోజోన్ సెంట్రల్ సర్కిల్ పరిధిలోని ఆజామాబాద్, మెహిదీపట్నం, సైఫాబాద్ డివిజన్లలో 6.27 లక్షల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. ప్రతి నెలా రూ.80 కోట్ల రెవెన్యూ వసూలవుతుంది. సాధారణంగా నెలరోజులు బిల్లు చెల్లించకున్నా సరఫరా నిలిపేస్తుంటారు. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్‌లో 2023, జనవరి 1 నుంచి 2024 అక్టోబర్ 22 వరకూ రూ.4.49 కోట్ల విలువచేసే 7,532 చెక్కులు బౌన్స్ అయ్యాయి.

చెక్ బౌన్స్ కాగానే నిబంధనల మేరకు చర్యలు చేపడుతుంటారు. లేదంటే, ఆ చెక్కులకు ప్రతినెలా లేట్ పేమెంట్ ఛార్జీను యాడ్ చేస్తుంటారు. ఇదేమీ కాకుంటే ఆ చెక్కు క్లియర్ అయ్యేదాకా ప్రతినెలా ఫైన్ పెరుగుతూనే ఉంటుం ది. ఈ రెండేళ్ల కాలంలో బౌన్స్ అయిన ఏ చెక్కుకు కూడా టీజీఎస్‌పీడీసీఎల్ లేట్ పేమెంట్ చార్జీలను విధించకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సర్కిల్‌లో ప్రతినెలా రూ.36 కోట్ల బకాయిలు రెగ్యూలర్‌గా పెండింగ్‌లో ఉంటు న్నాయి. ఒక్క సెంట్రల్ సర్కిల్‌లోనే రెండేళ్లకు 7,532 చెక్కులు బౌన్సయితే.. గ్రేటర్‌లోని సికింద్రాబాద్, బంజారాహిల్స్, సౌత్‌సర్కిల్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, సైబర్‌సిటీ, మేడ్చల్, హబ్సీగూడ, సంగారెడ్డి లలో ఈ పదేళ్లలో ఎన్ని చెక్కులు బౌన్స్ అయ్యింటాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

బౌన్స్ చెక్కులన్నీ నకిలీవేనా? 

ఆజామాబాద్ డివిజన్ రాంనగర్ సెక్షన్‌కు చెందిన ఎఫ్1007132 సర్వీస్‌పై రూ.60 వేలు, ఎఫ్1000358 సర్వీస్‌పై రూ.29 వేలు, ఎఫ్1016449 సర్వీస్‌పై రూ.150, ఎఫ్1000937 సర్వీస్‌పై రూ.100 మొత్తాలకు చెక్ బౌన్స్ అయినట్టు టీజీఎస్‌పీడీసీఎల్ 2023, అక్టోబర్ నెల చెక్ డిస్‌హానర్ (చెక్ బౌన్స్) జాబితాలో చేర్చింది.

2024 జూన్ 24న తీసిన ఈ స్టేట్‌మెంట్‌లో మొత్తం 34 చెక్కులకు రూ.6.15 లక్షలు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో తక్కువలో తక్కువ రూ. 67 నుంచి అత్య ధికంగా రూ.1,34,600 వరకు చెక్కులు ఉన్నాయి. అంబర్‌పేట సెక్షన్‌కు చెందిన ఓ వినియోగదారుడి పేరుతో ఏకంగా 24 చెక్కులు, రాంనగర్ సెక్షన్‌కు చెందిన మరో వినియోగదారుడి పేరుపై 8 చెక్కులు బౌన్స్ కావడం గమనార్హం.

ఇదిలా ఉండగా, ఇదే స్టేట్‌మెంట్ ను 2024, అక్టోబర్ 19న మరోసారి క్రాస్‌చెక్ చేయగా వీటిలో ఏ ఒక్క చెక్కుకు టీజీఎస్‌పీడీసీఎల్ లేట్ పేమెంట్ చార్జీ విధిం చలేదు. రెండేళ్లుగా చెక్కులు బౌన్స్ అవుతున్నా చర్యలు తీసుకోనందున బౌన్స్ అవుతున్న చెక్కులన్నీ ఫేక్ చెక్కులనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


వెలుగుల చాటున చీకటికోణం!

ప్రజలందరికీ వెలుగులు పంచే విద్యుత్ శాఖలో ఫేక్ చెక్కుల వ్యవహారాన్ని పలువురు ఉద్యోగులు భారీ కుంభకోణంగా భావిస్తున్నారు. ఈ చెక్కు బౌన్స్ సర్వీసులన్నీ అత్యధికంగా స్టేటస్ నంబరు 99 (బిల్ స్టాప్‌డ్)లో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

ఆజామాబాద్ డివిజన్ రామాలయం సెక్షన్ డీడీ కాలనీలోని ఏటీఐ క్యాంపస్‌లో జీరో బకాయి ఉండి లైవ్‌లో లేని (ఓఎస్‌ఎల్) సర్వీస్ వీ1093231కు 2010, జూలై నుంచి 2018, జనవరి వరకు రూ.46,456 బిల్లు వేసి, ఆ బిల్లును చెల్లించాలని సదరు వినియోగదారుడిని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో ఆ వినియోగదారుడు అప్పట్లో సీఎండీకి ఫిర్యాదు చేశాడు.

ఈ వ్యవహారంపై ఎంక్వైరీ జరిగినప్పటికీ, సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం కూడా అదే తరహాలో బిల్ స్టాప్ సర్వీసులకు భవిష్యత్తులో బిల్లులు రానందున వాటి స్థానంలో ఫేక్ (డమ్మీ) చెక్కులను ఉద్యోగులే జమ చేస్తూ ఆ బకాయిలను వసూలు చేసుకుంటున్నట్లు విమర్శలున్నాయి.

ప్రస్తుతం రాంనగర్ సెక్షన్‌లోని ఫేక్ చెక్కుల వ్యవహారం కూడా ఇదే తరహాలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ పరిస్థితులను పరిశీలిస్తే సొంత డిపార్ట్‌మెంట్‌ను విద్యుత్ ఉద్యోగులు నిలు వునా మోసం చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా మోసాలపై టీజీఎస్‌పీడీసీఎల్ అధికారులు తక్షణమే సమగ్ర దర్యాప్తు జరి పించాలని పలువురు కోరుతున్నారు.