calender_icon.png 7 February, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు

07-02-2025 12:00:00 AM

చార్మినార్, ఫిబ్రవరి 6: దేశంలో పేరుగాంచిన యూనివర్సీటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాను సౌత్, ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, డబీర్‌పురా పోలీసులు గురువారం పట్టుకున్నారు. పురానీ హావేలి కార్యాలయంలో అదనపు డీసీపీ టీ స్వామి వివరాలు వెల్లడించారు. శాలిబండకు చెందిన అబ్దుల్ ఖదీర్ (47), డబీర్‌పురా ఫర్హాత్ నగర్‌కు చెందిన మొహమ్మద్ షకీల్(37), ఉత్తర్‌ప్రదేశ్ కార్పూర్‌కు చెందిన సంజయ్‌శర్మ అలియాస్ సాహిల్ శర్మతో కలిసి కొన్నాళ్లుగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు.

ఎలాంటి విద్యార్హత లేని వారికి విదేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చంచల్‌గూడ డైమండ్ హోటల్ వద్ద ఉన్న అబ్దుల్ ఖదీర్, మొహమ్మద్ షకీల్‌ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి పలు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 91 నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్ ఫోన్లతో పాటు కొంత నగదు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. వీరికి సహకరిస్తున్న సంజయ్ శర్మ పరారీలో ఉన్నాడు.