calender_icon.png 2 October, 2024 | 1:56 PM

నకిలి సీబీఐ.. కోట్లు లూటీ

02-10-2024 01:52:12 AM

రూ. 7కోట్ల మేర మోసగించిన కేటుగాళ్లు

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పేదలు, ప్రముఖు లు అనే తేడా లేకుండా అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త, వర్ధమాన్ గ్రూప్ యజమాని ఎస్పీ ఓస్వాల్‌ను సైబర్ కేటుగాళ్లు.. ఫేక్‌కాల్ ద్వారా రూ.7కోట్లకు పైగా నగదును దోచేశారు. ఓస్వాల్ పంజాబ్ సైబర్ సెల్‌ను ఆశ్రయించడంతో.. వారు మోసగాళ్ల ఆటను కట్టించారు. ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి వారినుంచి రూ.5.25 కోట్లు రికవరీ చేశారు. 

సీబీఐ నుంచి కాల్ చేస్తున్నాం..

సెప్టెంబర్ 28న నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వారు తమను తాము సీబీఐ అధికారులుగా పేర్కొన్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో గతేడాది అరెస్టు అయిన జెట ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్‌తో మీకు వ్యక్తిగత సంబంధాలతో పాటు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు మాకు సమాచారం ఉందని.. విచారణ కోసం అవసరమైతే మిమ్మల్ని అరెస్టు చేయవలసి ఉంటుందని బెదిరించారు.

అలా కాకుండా ఉండాలంటే మీరు రెండు రోజుల పాటు డిజిటల్ అరెస్టు (ఇంట్లోనే ఉంటూ వీడియో కాల్ కంటిన్యూ చేయాలి)లో ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వారి మాటలు నిజమేనని నమ్మి తాను 48 గంటల పాటు ఇంట్లోనే ఉన్నానని ఓస్వాల్ తెలిపారు. ఆ సమయంలో  నా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు అడిగి రూ.7కోట్లకు పైగా నగదును వివిధ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుక్నురని ఓస్వాల్ తెలిపారు.