calender_icon.png 25 September, 2024 | 9:53 PM

నకిలీ ఉద్యమకారులే రాజ్యమేలిండ్రు!

25-09-2024 12:00:00 AM

పాలమూరు అంటేనే వలస జిల్లా. ఉపాధి అవకాశాలు లేక, సాగుకు నీరు లేక భూములన్నీ బీడుగా మారేవి. నీళ్ళు, నిధులు, నియమకాలతోనే తెలంగాణ సాధ్యమని నమ్మా. అందుకోసం అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఉద్యమాన్నీ తీవ్రతరం చేశా” అని అన్నాడు మలిదశ ఉద్యమకారుడు మున్నూరు రవి. ఈ సందర్భంగా అప్పటి ఉద్యమ జ్ఞాపకాలను పంచుకున్నాయన. 

“విద్యార్థి దశ నుంచి స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా పెట్టుకున్నా. ఒకవైపు చదువుకుంటూనే.. మరోవైపు ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలో పాల్గొనేవాడ్ని. అయితే పలు ఉద్యమ పార్టీల్లో పనిచేసినప్పటికీ తెలంగాణ ఏర్పాటునే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నా. ఇందుకోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా నాలాంటివారిలో ఉద్యమస్ఫూర్తిని నింపా. ఎన్నో పోరాటాలు చేసేలా ప్రేరేపించాను.

అంతిమంగా స్వరాష్ట్రం సాధించుకున్నాం. అయితే ఉద్యమకారుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని భావించా. కానీ ‘ఎక్కడి వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. మలిదశ ఉద్యమ సమయంలో నాపై 78 కేసులు నమోదు అయ్యాయంటే ఉద్యమకారుల పట్ల పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించారో అర్ధం చేసుకోవచ్చు. మలిదశ ఉద్యమ సమయంలో కరీంనగర్, ఢిల్లీ, ఆదిలాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా నాపై కేసులున్నాయి. 

ఉమ్మడి పాలకులే కాదు.. స్వరాష్ట్ర నేతలు సైతం ఇబ్బందులు పెట్టిన సందర్భాలున్నాయి. మంచి పేరొస్తుందనే ఉద్దేశ్యంతో కొంతమంది నాయకులకు నన్ను పలు కార్యక్రమాలకు దూరం చేశారు. అయినా నాలాంటివాళ్లను కలుపుకొని ఉద్యమ నినాదం చాటా. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టే సమయంలో వరుస ఆందోళన కార్యక్రమాలు నిర్వహించా.   ఈక్రమంలో ఆరునెలల పాటు జైల్లో ఉన్నా ఏ ఒక్క నాయకుడు సానుభూతి చూపలేదు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పడ్డానో.. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడ్డాను. రాజ్యాంగబద్దమైన పదవులు ఇచ్చి గౌరవించుకోవాల్సింది పోయి అసలైనవారిని దూరం పెట్టేశారు. ఉద్యమ సమయంలో నా తల్లిని రివాల్వర్‌తో బెదిరించినా, చంపుతామని కుటుంబసభ్యులకు వార్నింగ్‌లు ఇచ్చినా ఏనాడు నేను ఉద్యమాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నా.

ఉద్యమకారులకు 250 గజాల స్థలం, సొంతింటి కోసం రూ.10 లక్షలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఆ దిశగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. నకిలీ ఉద్యమకారులకు చెక్ పెట్టి.. అసలైనవారిని గుర్తించి సముచితస్థానం కల్పించాలి. తెలంగాణ ఆవతరణ దినోత్సవాల సమయంలో ఉద్యమకారులను పిలిచి సత్కరించాల్సిన అవసరం కూడా ఉంది” అని చెప్పారు. 

 జీ రఘు, మహబూబ్‌నగర్