05-04-2025 11:13:08 PM
చాట్ జీపీటీ సేవలు దుర్వినియోగం..
కఠిన ఆంక్షలు అవసరమంటున్న ఏఐ నిపుణులు..
న్యూఢిల్లీ: సాంకేతికత విషయంలో ప్రపంచం పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఏఐ రంగప్రవేశం తర్వాత మార్కెట్లో రోజుకో కొత్త టూల్ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం స్టూడియో గిబ్లీ మేనియా కొనసాగుతుండగానే కృత్రిమ మేధకు సంబంధించి ఒక అంశం తెరమీదకు వచ్చింది. చాట్ జీపీటీని ఉపయోగించి నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో పేరిట నకిలీ ఆధార్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. అంతకముందు ఇదే చాట్ జీపీటీ ఉపయోగించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్‌మన్‌ల ఆధార్ కార్డులు కూడా సృష్టించిన సంగతి తెలిసిందే.
కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు చాట్ జీపీటీలోని కొత్త ఇమేజ్ జనరేటర్‌ను ఉపయోగించి నకిలీ ఆధార్, పాన్ కార్డులను సృష్టించడం ప్రారంభించారు. ఏఐ వినియోగం ద్వారా లాభం కన్నా నష్టాలే ఎక్కువగా కనిపిస్తుండడంతో దీనిపై పరిమితిలు విధించాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు భావిస్తున్నారు. దీనిని గుర్తించిన టెక్ నిపుణులు చాట్ జీపీటీ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల ఫోటోరియలిస్టిక్ ఫోటోలు, శృంగార కంటెంట్, హింసాత్మక, ద్వేషపూరిత చిత్రాలను సృష్టించడం కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకురానున్నారు.