calender_icon.png 8 October, 2024 | 10:59 AM

బాధితులను ఆదుకోవడంలో విఫలం

04-09-2024 01:36:16 AM

రాష్ర్టం ఎటువైపు వెళ్తుందో..

బీఆర్‌ఎస్ ఎన్నడూ దాడి చేయలె

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి):  తెలంగాణలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. సహాయక కార్యక్రమాలు ఏపీలో ఒక రకంగా, తెలంగాణలో మరోరకంగా జరుగుతున్నాయని  అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు వరద బాధితులకు సహాయం చేద్దామని వెళ్తే కాంగ్రెస్ నాయకులు రాళ్లతో దాడులు చేశారని, రాష్ర్టం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదన్నారు. గతంలో సిద్దిపేటలో హరీశ్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేశారన్నారు.

ఈ దాడులకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్లు ఎవరూ భయపడే ప్రసక్తే లేదన్నారు. దాడులు చేసి బీఆర్‌ఎస్ పార్టీని కంట్రోల్ చేయాలనుకుంటే కాంగ్రెస్ నేతల తరం కాదన్నారు. పది సంవత్సరాల్లో బీఆర్‌ఎస్ ఎప్పుడూ దాడులు చేయలేదని, రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే కేసీఆర్ బందోబస్తు ఇచ్చారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రలు చేస్తే ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా సహకరించినట్లు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా పరిపాలన చేశామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా ప్రజలపై దాడులు చేయలేదని, పెట్టుబడులు పెట్టే స్థాయికి హైదరాబాద్ నగరం ఎదిగిందని, దాడులు చేస్తే తిరగరని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని మండిపడ్డారు. ఖమ్మంలో దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులతో సమయాన్ని వృథా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని ఆరోపించారు.  

  శాంతిభద్రలకు అదుపులో ఉంచాం: మహమూద్ అలీ 

కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా తెలంగాణలో శాంతి భద్రతలను అదుపులో ఉంచామని మాజీ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎక్కడా కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం చేస్తోందని, ఖమ్మంలో బీఆర్‌ఎస్ నేతలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.