రూ. 10.30 కోట్లు తీసుకున్న గాయత్రి యాజమాన్యం
2,664 మంది రైతులను మోసంచేసిన ఫ్యాక్టరీ
వారికి తెలియకుండానే రుణం తీసుకున్న వైనం
రుణమాఫీ మెస్సేజులు ఫోన్లకు రావడంతో మోసం వెలుగులోకి
రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గాయత్రి షుగర్స్ యాజమాన్యం వారిని మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చెరుకు, ఎరువుల అగ్రిమెంట్ పేరుతో సంతకాలు పెట్టించుకొని నిజామాబాద్ యూనియన్ బ్యాంక్‌లో 2,664 మంది రైతుల పేరున రూ.10.30 కోట్ల రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయం బయటపడటంతో చేసిన తప్పును కప్పి పుచ్చుకునేం దుకు రైతులకు తెలిసే రుణం తీసుకున్నామని యాజమాన్యం మాట మార్చింది.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో దానికి సంబంధించిన మెస్సేజులు రైతుల ఫోన్లకు రావడంతో వారికి విషయం అర్థమైంది. అప్పటివరకు ఈ విషయంపై వారికి సమాచారం లేదు. గత 20 ఏళ్లుగా రైతుల భూములపై బ్యాంక్ అధికారులను మేనేజ్ చేసుకొని రుణాలు, సబ్సిడీలు పొంది రైతులను నిలువున ముంచుతూ ప్యాక్టరీ యాజమాన్యం లబ్ధి పొందుతున్నట్లు తెలు స్తోంది. ప్రభుత్వాలు ఇస్తోన్న రుణమాఫీని ఫ్యాక్టరీ యాజమాన్యం వాడుకుంటున్నట్లు తాజా ఉదం తంతో బయటపడింది. రుణమాఫీ మెస్సేజులు వచ్చేవరకు రైతుల పేరున నిజామాబాద్ బ్యాంక్‌లో రుణాలు తీసుకున్న విషయం తెలియకపోవడమే ఇందుకు నిదర్శనం.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధిత రైతులు
కామారెడ్డి, జూలై 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ప్యాక్టరీతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం మాగి వద్ద ఉన్న గాయత్రి ఫ్యాక్టరీ ఒకే యాజమాన్యం కింద ఉన్నాయి. రెండు ఫ్యాక్టరీలతో ఒప్పందం ఉన్న 2,664 మంది రైతులను నిజామాబాద్ యూనియన్ బ్యాంక్‌కు జత చేసి గత 20 ఏళ్లుగా రుణాలు పొందుతున్నామని ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు పేర్కొనడం చూస్తుంటే ఏ రకమైన మోసం జరిగిందో అర్థమవుతోంది.
రైతుల పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ పెట్టి రుణాలు తీసుకొని సబ్సిడీలు పొంది పెద్ద మొత్తంలో ఫ్యాక్టరీ సిబ్బంది, యాజమాన్యం స్వలాభానికి వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. రైతుల పేరుపై రుణాలు తీసుకున్నట్లు బయటకు పొక్కడంతో ఫీల్డ్ సిబ్బంది ద్వారా ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. పదిరోజుల్లో రుణమాఫీ డబ్బులను చెల్లిస్తామని యాజమాన్యం ప్రస్తుతం రైతులను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అంగీకరించినా ఆ డబ్బును రైతులకు నేరుగా ఇస్తారా? బ్యాంక్ ద్వారా చెల్లిస్తారా? అని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు బాధిత రైతులు వాపోతున్నారు.
ఈ వ్యవహారంలో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉందంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు. రైతులకు రుణాలు ఇవ్వాలంటే 15 రోజుల పాటు బ్యాంక్ చుట్టు తిప్పుకునే ఈ రోజుల్లో ఏకంగా 2,664 మంది రైతులకు సంబంధించి రూ.10 కోట్ల రుణాలు ఏటా ఇవ్వడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం, బ్యాంక్ అధికారులు కుమ్మక్కై ఈ దందాను కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు.
ఆధార్ కార్డు లింక్ లేకుంటే ఈ విషయం కూడా బయటికి తెలిసేది కాదని, ఇంకా ఇదే తంతును భవిష్యత్తు లోనూ కొనసాగించేవారిని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు రుణమాఫీ జరిగిన ఆ డబ్బులను రైతులకు అప్పగించిన పాపాన పోలేదంటే ఈసారి కూడా కేవైసీ లేకుంటే రుణమాఫీ డబ్బులు ఫ్యాక్టరీ యాజమాన్యం, బ్యాంక్ అధికారులు కలిసి స్వాహ చేసేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల పేరుతో డబ్బులు తీసుకుని తమ అవసరాలకు వాడుకోవడం ఎంతవరకు సమం జసమని రైతులు నిలదీస్తున్నారు.
ఈ మేరకు రుణమాఫీ సొమ్ము కాజేశారన్న విషయంపై విచారణ జరిపితే అసలు గుట్టు బయటపడుతుందని రైతులు అంటున్నారు. కేవలం కామారెడ్డిలోనే కాకుండా రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేట్, జగిత్యాల, నిజామాబాద్, బోధన్ నుంచి చెరుకును క్రషింగ్‌కు గాయత్రి యాజమాన్యం అడ్లూర్ ఎల్లారెడ్డి, మాగి ప్యాక్టరీ లకు ప్రతి సీజన్‌లో చెరుకును క్రషింగ్‌కు తరలిస్తారు. అక్కడి రైతుల పేరుమీద కూడా ప్యాక్టరీ అధికారులు రుణాలు తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌కు, జిల్లా వ్యవసాయధికారికి రైతులు బుధవారం పిర్యాదు చేశారు. అంతవరకు ఫ్యాక్టరీ అధికారులు ప్రెస్‌మీట్ పెట్టేందుకు జంకినట్లు రైతులకు సమాచారం. అనుమతులు లేకుంబింధి రూ.లక్ష లోపు రుణమాఫీ 450 మందికి ఐదు కుటుంబాల రైతులకు మేసేజ్‌లు వచ్చినట్లు తెలుస్తుంది. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే కోట్లాది రూపాయల కుంభకోణం వెలుగుచూసే అవకాశాలు ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మీడియాతో పాటు ఉన్నతాధికారులను మేనేజ్ చేసే అవకాశముందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
రుణమాఫీ రైతులకు ఇప్పించాలి
జిల్లా వ్యవసాయ అధికారిణికి వినతిపత్రం అందజేసిన రైతులు
కామారెడ్డి, జూలై 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్‌ఎల్లారెడ్డి గాయత్రీ షుగర్స్ యాజమాన్యం, అధికారులు కుమ్మకై 2,600 మంది రైతుల పేరిట రూ.1130 లక్షల బ్యాంక్ రుణాలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, వ్యవసాయ అధికారిణికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. రైతులకు రుణమాఫీ డబ్బులను ప్యాక్టరీ అధికారులు ఇప్పించాలని కోరారు. లేకుంటే రైతుల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలిపారు. రైతులకు తెలియకుండా రైతుల పేరిట రుణాలు తీసుకోవడం అన్యాయానికి గురిచేయడమేనని తెలిపారు. ఫ్యాక్టరీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులకు సమాధానం చెప్పని ప్యాక్టరీ యాజమాన్యం
గాయత్రి షుగర్స్ యాజమాన్యం, అధికారులు కుమ్మకై రైతులకు తెలియకుండా రైతుల పేర క్రాప్ రుణాలను తీసుకొని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని వాడుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో రైతుల ఖాతాలోకి ప్రభుత్వం పంపిన మెసేజ్‌లు రావడంతో ప్యాక్టరీ యాజమాన్యం రుణాలు తీసుకున్న విషయం బయట పడింది. ఈ విషయంపై రైతులతో కలిసి ఫ్యాక్టరీ వద్దకు వెళ్లితే వారు సమాధానం చెప్పకుండా అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. ఇది సరైన పద్దతి కాదు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
సాయాగౌడ్, రైతు,కుప్రియాల్, కామారెడ్డి జిల్లా
20 ఏళ్లుగా రుణం తీసుకుంటున్నాం
రైతుల ప్రయోజనం కోసం గత 20 ఏళ్లుగా బ్యాంక్ ద్వారా రుణం తీసుకుంటున్నాం. మళ్లీ బ్యాంక్‌కు తిరిగి చెల్లిస్తున్నాం. రైతులను మోసం చేసేది లేదు. రైతులకు పదిరోజుల్లో రుణమాఫీ డబ్బులను వారి ఖాతాల్లో జమచేస్తాం. బ్యాంక్ అధికారుల సలహాలను తీసుకొని ఏ ఒక రైతుకు కూడా నష్టం చేయం. గత 25 సంవత్సరాలుగా రైతులతో నమ్మకంతో పనిచేస్తున్నాం. ఫ్యాక్టరీ ఫీల్డ్ సిబ్బంది రైతులతో మాట్లాడి వారి ఇష్టం మేరకే బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాం. ఈ సారి ఫ్యాక్టరీ నుంచే రుణం తీసుకుంటాం. ఏ రైతు కూడా అపోహలకు గురికావద్దు.
వేణుగోపాల్‌రావు, ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్,
గాయత్రి షుగర్స్, కామారెడ్డి