calender_icon.png 19 January, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల చదువుకు అనుగుణంగా సౌకర్యాలు

18-01-2025 05:29:24 PM

భద్రాచలం (విజయక్రాంతి): ఇంటిని మరిపించే విధంగా గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు చదువుతో పాటు వారికి కావలసిన సౌకర్యాలు కల్పించడానికి పిల్లలకు విశాలంగా ఉండే విధంగా డార్మెటరీ, డైనింగ్ హాల్ ప్రత్యేక డిజైనింగ్ ద్వారా నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. శనివారం నాడు భద్రాచలం పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలలు, గ్రంథాలయమును ఆయన సందర్శించి, ప్రత్యేక డిజైనింగ్ ద్వారా నిర్మాణం చేపట్టే డైనింగ్ హాల్, డార్మెటరీ గ్రంథాలయంలో పాఠకులు కూర్చొని చదివే విధంగా రూమ్ ల నిర్మాణం కొరకు ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా డార్మెటరీ, డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టడానికి ప్రత్యేకంగా హైదరాబాదు నుండి డిజైనింగ్ చేయడానికి డిజైనర్లను తీసుకురావడం జరిగిందని, వారి సమక్షంలో డైనింగ్ హాల్, డార్మెటరీ, గ్రంథాలయంలో పాఠకులు చదవడానికి కూర్చునే హాలు కొరకు ఎంతవరకు స్థలం కావాలో పరిశీలించి పాఠకులకు, పిల్లలకు ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా కూర్చొని భోజనాలు చేసే విధంగా, రాత్రిపూట ప్రశాంతమైన వాతావరణంలో పడుకునే విధంగా డార్మెటరీ డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టాలని, ఈ కొత్త తరహా డైనింగ్ హాల్ డార్మెటరీ పిల్లలకి అనుగుణంగా ఉంటే అన్ని పాఠశాలల్లో ఇదే తరహా డైనింగ్ హాల్ డార్మెట్రీలు నిర్మాణం చేపడతామని అన్నారు.

అలాగే భద్రాచలంలోని గ్రంథాలయంలో కూడా పాఠకులు విశాలంగా కూర్చొని చదువుకునేలా హాలు కూడా నిర్మాణం చేపడతామని అన్నారు. అనంతరం కేసిఆర్ కాలనీలోని గ్రామపంచాయతీ ద్వారా నడపబడుతున్న నర్సరీని సందర్శించి ప్రజలకు అవసరమయ్యే మొక్కలు పెంచాలని, వివిధ రకాల పండ్ల మొక్కలు, మునగ చెట్లు, వెదురు మొక్కలు పెంపకం చేపట్టాలని నర్సరీ నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటీడీవో అశోక్ కుమార్, డి ఈ హరీష్, టీఎస్ శ్రీనివాస్, జిపిఈఓ శ్రీనివాస్, ఏపీఎం అపర్ణ, హెచ్ఎంలు వెంకటేశ్వర చారి, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.