15-04-2025 03:21:59 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు గొడిషాల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి పనుల వద్ద వేసవికాలం నేపథ్యంలో కూలీలకు సౌకర్యాల కల్పనపై అధ్యాయనం నిర్వహించడంలో భాగంగా కేసముద్రం మండలం గాంధీనగర్ గ్రామ పరిధిలో ఉపాధి పనులు నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లి సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ... పని ప్రదేశంలో నిబంధనల ప్రకారం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు, నీడ కల్పించేందుకు టెంట్, మంచినీటి సౌకర్యం లేవని ఆరోపించారు. అలాగే గత కొద్ది నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపు నిలిచిపోయిందని, కూలీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది విఫలమయ్యారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి ఉపాధి పనులు నిర్వహించే చోట తప్పకుండా నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.